టీమిండియా ఆటగాళ్లంతా చాలా కాలం తరువాత ఒక చోట కలిసి రోడ్ సేఫ్టీ టోర్నీ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో సమయం తరువాత ఒకచోట చేరడంతో వారంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఓ ప్లేయర్ బర్త్‌డే రావడంతో లెంజెండరీ ఆటగాళ్లంతా చిన్న పిల్లలైపోయారు. గంతులెస్తూ అల్లరి చేశారు. పిల్లల్లా ఒకరికొకరు కేక్ పులుముకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్ మంగళవారం తన ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞ్యాన్ ఓఝా బర్త్‌డే సెలబ్రేషన్స్ మంగళవారం ఇండియా లెజెండ్స్ సభ్యుల మధ్య జరిగాయి. ఈ క్రమంలోనే కేక్ కట్ చేసిన తరువాత అంతా కలిసి ఓఝాకు కేక్ పూశారు. యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్ పఠాన్‌లు అతడి ముఖంపై కేక్ పులిమేశారు. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. ఆ వెంటనే ఓజా కేక్ పూసేందుకు ప్రయత్నించగా ఇర్ఫాన్ తప్పించుకోని పారిపోయాడు.
ఇక అక్కడే ఉన్న యువరాజ్ మాత్రం దొరికిపోయాడు. ఈ క్రమంలోనే ఓఝా, యువరాజ్ మధ్య కేక్ పూయడం కోసం ఓ చిన్న ఫైట్ జరిగింది. యువరాజ్ కూడా రెండు చేతుల్లోకి కేక్ తీసుకున్నాడు. ఇంతలో కైఫ్ వెనకనుంచి వచ్చి యువీని పట్టుకున్నాడు. అంతే ఓఝా తన చేతిలో ఉన్న కేక్ మొత్తం యువీ ముఖానికి పూసేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా సరదా కామెంట్స్ చేస్తున్నారు. ‘యువీ దొరికిపోయాడు, ఇక తప్పించుకోలేడు’, ‘యువీ, ఓఝా మధ్య ఫైట్, గెలిచేదెవరో ఈ నైట్’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే బుధవారం జరిగిన రోడ్ సేఫ్టీ ఫస్ట్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. సచిన్, యువీ, యూసుఫ్‌ల వీరబాదుడుకు ఇండియా లెజెండ్స్ ఏకంగా 218 పరుగులు చేసింది. దీంతో సునాయాసంగా విజయం సాధించవచ్చని అనుకుంది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ అద్భుతంగా పోరాడింది. ఒకానొక దశలో మ్యాచ్ విండీస్ వశం అయినట్లే అనిపించింది. కానీ చివరి మూడు ఓవర్లలో గోనీ, వినయ్ కుమార్, ఇర్ఫాన్ అద్భుతంగా వేయడంతో 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించి ఫైనల్ చేరింది.