రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో యువరాజ్ విశ్వరూపం చూపిస్తున్నాడు. ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలా మారాడు. వెస్టిండీస్ లెజెండ్స్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విండీస్ బౌలర్లను ఉతికారేశాడు. స్పిన్నర్లు నాగముత్తు, బెన్‌ల బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టోర్నీలో ఇప్పటివరకు ఏ జట్టు చేయని అత్యధిక స్కోరును ఇండియా లెజెండ్స్ నమోదు చేసింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లెజెండ్స్.. సెహ్వాగ్(17) కొద్ది సేపటికే అవుటైనా.. ఓపెనర్, కెప్టెన్ సచిన్ టెండూల్కర్(65: 42 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) అర్థ సెంచరీతో అలరించాడు. యుసుఫ్ పఠాన్(37:20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో నాటౌట్) కూడా బౌండరీలతో ధాటిగా ఆడాడు. అయితే సచిన్ ఔటైన తరువాత క్రీజులోకొచ్చిన మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(20 బంతుల్లో 1ఫోర్, 6సిక్సర్లతో 49 నాటౌట్ ) మ్యాచ్ గతినే మార్చేశాడు. యువీ బాదుడుకు స్కోరు బోర్డు మెరుపు వేగంతో దూసుకుపోయింది. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. వెస్టిండీస్ లెజెండ్స్ బౌలర్లలో టినో బెస్ట్ 2 వికెట్లు తీసుకోగా.. ర్యాన్ ఆస్టిన్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ లెజెండ్స్ కూడా ఓపెనర్ పెర్కిన్స్(9: 5 బంతుల్లో 2 ఫోర్లు) వికెట్ వెంటనే కోల్పోయింది. కానీ మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్(63: 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకొచ్చిన దేవ్‌నారాయణ్(59: 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు).. స్మిత్‌తో కలిసి రన్ రేట్ పడిపోకుండా బౌండరీల వర్షం కురిపించారు. స్మిత్, ఎడ్వర్డ్స్(0) వెంటవెంటనే అవుటైనా.. లారా(46: 28 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సులు)తో కలిసి దేవ్‌నారాయణ్ స్కోరు వేగం తగ్గకుండా చూసుకున్నాడు. లారా కూడా అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇండియా లెజెండ్స్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. కానీ లారా అవుటైన తరువాత విండీస్ నెమ్మదించింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ మ్యాచ్‌ను గెలుచుకోవడమే కాకుండా ఫైనల్‌కు అర్హత సాధించింది. చివరి 3 ఓవర్లలో పేసర్లు గోని, వినయ్, పఠాన్ కట్టుదిట్టంగా వేసి ఇండియా లెజెండ్స్‌కు విజయాన్ని కట్టబెట్టారు.