మన భారత దేశంలో, ముఖ్యంగా పల్లెటూళ్లలో ఆవులు, గేదెల పేడతో పిడకలు చేయడం, వాటిని కుంపట్లలోకి, ఇతర అవసరాలకు వాడడం సర్వసాధారణం. పిడకల్లో ఔషధ గుణాలు కూడా ఉంటాయని, వాటిని కాల్చడం ద్వారా వచ్చే పొగ శ్వాస వ్యవస్థ బాగుపడడానికి కూడా ఉపయోగపడుతుందని అనేకమంది అభిప్రాయపడుతుంటారు. అయితే ఇందులో నిజమెంతుందో పక్కన పెడితే.. అమెరికాలో మాత్రం వీటిని చాలా దూరంగా ఉంచుతారట. అంతకాదు భారత్ నుంచి పిడకలను అమెరికా తీసుకురావడాన్ని కూడా ఆ దేశం నిషేధించిందంటే ఇక వారికి ఇవంటే ఎంత భయమో ఆలోచించంది.
పిడకలు చూస్తేనే అమెరికా ప్రజలు బెంబేలెత్తిపోతారు. పిడకల వల్ల ఫుట్ అండ్ మౌత్ డిసీజ్(ఎఫ్ఎండీ)కి వస్తుందేమోనని భయపడిపోతుంటారు. ఎఫ్ఎండీ అనేది పశువులకు వచ్చే వ్యాధి. ఇది విస్తృతంగా, వేగంగా విస్తరించడమే కాకుండా పశు జనాభాకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఫలితంగా వాటి యజమానులకు తీవ్ర ఆర్థిక నష్టాల్లోకి నెట్టేస్తుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటేంటే.. అమెరికాలో కూడా పిడకల వినియోగం ఉంది. అమెరికాలోనే కాదు ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పిడకలను వినియోగించి వంట చేసుకుంటారు. పేడను యంటీ బ్యాక్టీరియల్‌గా, స్కిన్ డిటాక్సిఫయర్‌గా, ఎరువుగానూ ఉపయోగిస్తారు. అయినప్పటికీ భారత్ నుంచి ఆవు పిడకలను తీసుకురావడాన్ని అమెరికా ప్రభుత్వం నిషేధించింది. దీనికి కారణం ఎఫ్ఎండీ.
ఎఫ్ఎండీకి సంబంధించి ఒక్క కేసు ఏదైనా దేశంలో నమోదైనా ప్రపంచవ్యాప్తంగా పశు వాణిజ్యం ఆగిపోతుంది. అమెరికాలో 1929 నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఎండీకి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అందుకే ఈ విషయంలో అమెరికా ఇంత పటిష్ఠమైన నిబంధనలను పాటిస్తుంది. తాజాగా గత నెలలో కూడా అమెరికన్ ఎయిర్‌పోర్టులో ఓ భారత ప్రయాణికుడి వద్ద పిడకలను చూడగానే.. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ధ్వసం చేసింది.
ఏప్రిల్ 4న వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ప్రయాణికుడి సూట్‌కేసులో రెండు ఆవు పిడకలను గుర్తించిన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అగ్రికల్చర్ నిపుణులు వెంటనే వాటిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా సదరు ప్రయాణికుడికి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.