న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,711 కొత్త కేసులు నమోదు కాగా.. అందులో 84.71 శాతం కేసులు కేవలం పైన పేర్కొన్న ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఆ ఆరు రాష్ట్రాలు పోగా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కేవలం 15.29 శాతం కొత్త కేసులు మాత్రమే వెలుగుచూశాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కేవలం కొత్త కేసుల విషయానికి వస్తే దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నో కొన్ని కేసులు నమోదైనా..రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, గోవా, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, సిక్కిం, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా, నగర్‌హవేలీ, త్రిపుర, మిజోరం, అండమాన్, నికోబార్ ఐలాండ్స్‌లో మాత్రం గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు