బెంగుళూరు: కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలుకా దేశవళ్ళిలో రంగప్ప, ఆశా (28) దంపతులు నివాసం ఉంటున్నారు. రంగప్ప, ఆశా దంపతుల అన్యోన్యతకు గుర్తుగా వారికి ముగ్గురు పిల్లలు. పిల్లలతో కలిసి ఆశా, రంగప్ప సంతోషంగా ఉండేవారు. అయితే కొన్నాళ్ల నుంచి రంగప్ప ప్రవర్తనలో మార్పు వచ్చింది. చిన్నదానికి, పెద్దదానికి ఆశను అనుమానించడం మొదలు పెట్టాడు. ఎవరితో మాట్లాడినా, ఎవరిని చూసినా అనుమానించేవారు. దీంతో ప్రశాంతంగా ఉండే వారి కుటుంబం ఉన్నట్లుండి అతలాకుతలమైంది. రోజు తగాదాలతో అల్లకల్లోలమైంది. దీనికి కారణం ఆశా తెల్లగా చాలా స్లిమ్‌గా, అందంగా ఉండడమే. రంగప్ప నల్లగా ఉండటంతో తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనకంటే భార్య అందంగా ఉండటం రంగప్పకు నచ్చలేదు. తన భార్య ఆశాకు ఎవరితోనో అక్రమ సంభంధం ఉందని, అందుకే రోజు అందంగా రెడీ అయి అతడికోసం ఎదురుచూస్తోందని అనుమానం పెంచుకున్నాడు.
‘నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తరువాత ఎవరితో నువ్వు తిరుగుతున్నావు..? నువ్వు ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నావు..?’ అని భార్యపై రంకెలేశాడు. అలాంటిదేమీ లేదని ఆశ గొడవపడింది . ఇక అక్కడి నుంచి అదేతరహా గొడవలు ఇంట్లో పెరిగిపోయాయి. ఆశ జీవితంలో ఆనందం మటుమాయమైంది. రంగప్ప అనుమానం అంతులేకుండా పోయింది. అది ఎంతలా పెరిగిందంటే.. తన భార్యను చంపేయాలని ఆలోచించేవరకు పెరిగింది. తన భార్య అందంగా ఉండడం వల్ల అక్రమసంబంధాలకు మరిగిందని, ఆమెను చంపేయడమే మార్గమని రంగప్ప అనుకున్నాడు. అంతే తన బావతో కలిసి ఆశను చంపేయాలని పకడ్బందీగా ప్లాన్ వేశాడు.
ప్లాన్ ప్రకారం భార్య ఆశను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అక్కడికి ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం బావ చంద్రను పిలిపించుకున్నాడు. వెంటనే భార్య ఆశాను కట్టేశాడు. కొడవలి తీసుకుని ఆశాను నిర్దాక్షిణ్యంగా చంపి, ముక్కలు ముక్కలుగా నరికేశాడు. భార్యను చంపి ఆమెపై పగ తీర్చుకున్నాడు. భార్య శరీరం ముక్కలు ముక్కలు చేసి వాటిని హేమావతి నదిలో విసిరేశాడు. అంతా అయిపోయిందని అతడు, అతని బావ చంద్ర చేతులు దులుపేసుకున్నారు. ఈ ఘటన అంతా నాలుగు నెలల క్రితం జరిగింది.
అయితే తన కూతురు ఆశా కనపడకపోవడంతో ఆమె తండ్రి గౌరీ శంకర్‌కు అనుమానం వచ్చి పాండవపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. ఇదే సమయంలో హేమావతి నదిలో మహిళ శరీరంలోని ముక్కలు గుర్తించిన కృష్ణరాజపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నిమిత్తం ఇతర పోలీస్ స్టేషన్‌లను కన్సల్ట్ అవ్వగా గౌరీశంకర్ పెట్టిన కేసు ప్రకారం అతడిని పోలీసులు విచారించారు. హేమావతి నదిలో చిక్కిన మహిళ శరీరం ముక్కలు తన కూతురివే అని గౌరీ శంకర్ పోలీసులకు చెప్పాడు. విషయం అర్థం అయిన పోలీసులు వెంటనే కేసు నుంచి తప్పించుకుని తిరుగుతున్న భర్త రంగప్పను పోలీసులు అరెస్టు చేశారు.