ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభం కూడా కాకముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక బ్యాట్స్‌మన్ గాయం కారణంగా ఆటకు దూరమయ్యేలా ఉన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రస్తుతం మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఇప్పటికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భవిష్యత్తు టోర్నీలలో విలియమ్స్ పాల్గొనడం ముఖ్యమని అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ప్రస్తుత సిరీస్‌ల నుంచి విలియమ్సన్‌కు విశ్రాంతి కల్పించామని న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో విలియమ్సన్ ఎడమ మోచేతిలో చిన్న గాయం అయింది. దారి నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని న్యూజిలాండ్ క్రికెట్ మెడికల్ మేనేజర్ డేలే షాకెల్ తెలిపారు. ‘గత కొన్నిరోజులుగా కేన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. రోజులు గడుస్తున్నా దురదృష్టవశాత్తు గాయం నయమవ్వలేదు. విశ్రాంతి లేకుండా మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల అతని గాయం మరింత పెరిగింది. ఆ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోవాలంటే తగిన విశ్రాంతితో పాటు రిహాబిలిటేషన్ అవసరం. వచ్చే వారం నుంచి విలియమ్సన్ రిహాబిలిటేషన్ తీసుకుంటాడ’ని షాకెల్ తెలిపాడు.
న్యూజిల్యాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. టెస్ట్ ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ సమయానికి విలియమ్స్ ఆరోగ్యంగా ఉండటం తమకెంతో అవసరమని, అతడి విషయంలో ఒక్క తప్పుడు నిర్ణయం కూడా తీసుకోలేమని అన్నారు. ‘దేశం కోసం ఆడాలని తాపత్రయ పడే ఏ ఆటగాడైనా విశ్రాంతి తీసుకోవాలని వెనక్కితగ్గే అవకాశం లేదు. బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ చేయాలంటే మోచేయి సరిగ్గా ఉండాలి, లేకుంటే అతడు కొట్టే షాట్‌లు అనుకున్న ఫలితాలను ఇవ్వవు అందుకే అతడికి విశ్రాంతి అవసరం’ అని గ్యారీ స్టెడ్ పేర్కొన్నారు.
న్యూజిల్యాండ్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గురించి ఆలోచిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్2021 సీజన్‌లో విలియమ్సన్ ఆడేందుకు అనుమతించే అవకాశాలు తగ్గిపోయాయి. ఒకవేళ కివీస్ క్రికెట్ బోర్డు అంగీకరించకపోతే కేన్ కచ్చితంగా ఐపీఎల్‌కు దూరం కావలసిందే. అదే జరిగితే కచ్చితంగా అది సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బనే చెప్పాలి.