Thursday, November 21, 2024

ఈటల కొత్త పార్టీ.. మీడియాతో ఏమన్నారంటే..?

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఒక్కసారిగా ఆయనపై భూ కబ్జా కేసులు నమోదు కావడం, మంత్రి వర్గం నుంచి ఆయనను తొలగించడం, గవర్నర్ దానికి ఆ మోదం తెలపడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కుదుపు ఏర్పడింది. అయితే ఈటల మాత్రం తాను ఎలాంటి తప్పూ చేయలేదని, అధికారుల నివేదికలన్నీ తప్పుల తడకలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల తనతో కలిసి వచ్చే నేతలతో ప్రత్యేకంగా మంతనాలు జరుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకుండా వారితో కలిసి కొత్త పార్టీ పెట్టడంపై సమాలోచనలు చేస్తున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. సదరు వార్తలను కొట్టి పారేశారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న హడావుడి అంతా అవాస్తవమని, కొత్త పార్టీ పెట్టే ఆలోచనే తనకు లేదని, నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాని చెప్పుకొచ్చారు. పార్టీ భీఫామ్ ఉన్నంతమాత్రాన ఏ నాయకుడూ గెలవలేడని, ప్రజల ఆమోదం ఉంటేనే విజయం వరిస్తుందని అన్నారు.

‘నాకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో కచ్చితంగా ఉంది. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశాను. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామాకు కూడా వెనుకాడలేదు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నా శాయశక్తులా నిర్వర్తించాను. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదు. కానీ ఉన్నట్లుండి నాపై ఒక్కసారిగా దారుణ ఆరోపణలొస్తున్నాయి. గత మూడ్రోజులుగా నేను ఏదో తప్పు చేసినట్లు తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదంతా పూర్తి అవాస్తవం. నాపై వచ్చిన ఆరోపణలపై నా నుంచి కనీసం వివరణ కూడా తీసుకోలేదు. సంబంధం లేని భూములను నాకు అంటగడుతున్నారు’ అని ఈటల రాజేందర్ ఆరోపించారు.

పథకం ప్రకారమే తనపై కుట్ర జరిగిందని, తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారని, వేల కోట్లు సంపాధించానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జమున హ్యాచరీస్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, తనకు సంబంధం లేని భూముల్లో సర్వే చేసి అవి తనవిగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులేనని అన్నారు. అయితే అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని తాను కాదని, నయీం గ్యాంగ్ తనను చంపేందుకు రెక్కీ నిర్వహించిన రోజే భయపడలేదని, ఇప్పటికీ అదే గుండె ధైర్యం తనలో ఉందని ఈటల పేర్కొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x