ఆటగాళ్లపై నమ్మకం ఉండవచ్చు. కానీ అతి నమ్మకం ఉండకూడదు. మైదానంలో ఆడే ఆటగాడు ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చెప్పడమే కష్టం. అలాంటిది అతడు ఏకంగా అదరగొట్టేస్తాడంటూ అనడం కొంత అతిశయోక్తేనని చెప్పాలి. తాజాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి పనే చేశాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేస్తాడని, ఇండియా 400 పరుగులు మార్క్‌ను దాటుతుందని ఓ ట్వీట్ చేసి తరువాత నాలుక్కరుచుకున్నాడు. ఇంగ్లండ్-ఇండియా మధ్య మూడో వన్డే ఈరోజు ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించడమే కాకుండా సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభంలో ఓపెనర్ రోహిత్ శర్మ గురించి అశ్విన్ ఓ ట్వీట్ చేశాడు.
‘ప్రపంచ క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, అలాగే వన్డేల్లో 400పైగా పరుగులు ఒక్కసారి మాత్రమే ఛేజ్ చేయడం జరిగింది’ అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అయితే అశ్విన్ ఆ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహత్ అవుటయ్యాడు. దీంతో ఆ ట్వీట్‌ను తొలగించేసిన అశ్విన్.. ‘రోహిత్‌కు నా దిష్టి తగిలిందం’టూ మరో ట్వీట్ చేశాడు.
దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నమ్మకం ఉండొచ్చు కానీ, అతి నమ్మకం ఉండకూడదంటూ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్‌పై సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ‘నిజమే రోహిత్ వన్డేల్లో డబుల్ సెంచరీ మూడుసార్లు చేశాడు. వన్డేల్లో 400 పరుగులు ఒక్కసారే ఛేజ్ చేశారు. కానీ మ్యాచ్ మొదట్లోనే అలాంటి ప్రెడిక్షన్స్ చేయడం మంచిది కాదు’ అంటూ అశ్విన్‌కు హితవు పలుకుతున్నారు.