అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ మధ్యలో వెళ్లిపోవడం అభిమానులందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇంత ఉత్కంఠగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ వెళ్లిపోవడం ఏంటని..? అంతా షాకయ్యారు. అయితే దీనిపై కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కాలు బెణికిందని, అలాగే ఫీల్డింగ్ చేస్తే కచ్చితంగా గాయం పెద్దదవుతుందన్న కారణంతోనే మైదానం వీడివెళ్లానని కోహ్లీ వివరించాడు. అందువల్లే కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్‌కు అప్పగించి డగౌట్‌లో కూర్చున్నట్లు కోహ్లీ వివరించాడు.
‘బంతికోసం వేగంగా పరిగెత్తే సమయంలో బంతిని విసిరేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలోనే కాలు బెణికిందని, అలాగే ఫీల్డింగ్ చేస్తే కచ్చితంగా గాయం పెద్దదవుతుందనే ఆందోళనతోనే మైదానం వీడాల్సి వచ్చిందని కోహ్లీ వివరించాడు. అందువల్లే 17వ ఓవర్లో రోహిత్‌కు కెప్టెన్సీ అప్పగించి మైదానం వీడినట్లు తెలిపాడు. దీంతో చివరి మూడు ఓవర్ల కెప్టెన్సీలో రోహిత్ తన మార్క్ కెప్టెన్సీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ప్రధానంగా ఎటాకింగ్ ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా కట్టడిచేశాడు. దీంతో ఎట్టకేలకు 8 పరుగుల తేడాతో టీమిండియా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మళ్లీ ఓపెనర్లు నిరాశే మిగిల్చారు. రోహిత్ శర్మ(12), కేఎల్ రాహుల్(14) వెంటవెంటనే అవుటైపోయారు. కానీ వన్‌డౌన్‌లో కోహ్లీ స్థానంలో వచ్చిన అరంగేట్ర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(57: 28 బంతుల్లో..) అద్భుత అర్థ సెంచరీతో అదరగొట్టడం, చివర్లో అయ్యర్(37) మెరుపులతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కాగా 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు చివరి వరకు పోరాడినా గెలుపు మాత్రం ఇండియాకే దక్కింది.