టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20 చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. అయితే చివరి ఓవర్లో భారత్ విజయం సాధించింది. మొదటి నుంచి నువ్వా నేనా అంటూ సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను బౌలర్లు దీటుగా అడ్డుకున్నారు. దీంతో టీమిండియా మ్యాచ్‌లో విజయం సాధించడమే కాకుండా సిరీస్ కూడా సమం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్లో టీమిండియా శిబిరంలో టెన్షన్ రేపిన ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గురించి తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరి ఓవర్ 4వ బంతికి ఆర్చర్ భారీ షాట్ ఆడబోగా.. బ్యాట్ ఎడ్జ్ విరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యాట్ విరుగుతుందని ఆర్చర్‌కు మూడేళ్ల క్రితమే తెలుసట. అందుకే అప్పుడే బ్యాట్లు బాగుచేసే వారి కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తూ ఏకంగా ఓ ట్వీట్ కూడా చేశాడట. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
ఆర్చర్ గురించి నెటిజన్లు చెప్పే విషయాలు వింటే మనకు కూడా ఆర్చర్ జోస్యం ‘నిజమేనేమో..!’ అనిపిస్తుంది. తాజాగా ఇండియాతో జరిగిన టీ20లో అతడి బ్యాట్ విరగుతుందని కూడా ఆర్చర్ 2018లోనే గుర్తించాడట. దీనికి ప్రూఫ్‌గా ఎప్పుడో 2018లో ఆర్చర్ చేసిన ఓ ట్వీట్‌ను నెటిజన్లు చూపిస్తున్నారు. ఆ ట్వీట్‌లో ఆర్చర్.. ‘ఇంగ్లండ్‌లో ఎవరైనా బ్యాట్‌లు బాగుచేసే వారుంటే చెప్పండి’ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఎప్పుడో మూడేళ్ల క్రితం ట్వీట్ చేస్తే ఇప్పుడు బ్యాట్ విరిగింది. అంటే ఇప్పటికీ ఆర్చర్‌కు బ్యాట్‌లు బాగు చేసే వ్యక్తి దొరకలేదో ఏమో మరి!
ఇదిలా ఉంటే జోఫ్రా ఆర్చర్ చేసే ట్వీట్లు గత కొన్నాళ్లుగా తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్చర్ చేసే ట్వీట్లను నెటిజన్లు వెతికి మరీ బయటకు తీసి ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి చూపిస్తున్నారు. ఇంతకుముందు ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటతీరు, పంజాబ్ కింగ్స్ జట్టు, ముంబై ఇండియన్స్ జట్టు గురించి, క్రిస్ గేల్ వంటి ఆటగాళ్ల గురించి ఆర్చర్ ఎప్పుడో చేసిన ట్వీట్లు అప్పట్లో బయటకొచ్చాయి. మరింత విచిత్రంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఓటమి గురించి కూడా జోఫ్రా ఆర్చర్ ఎప్పుడో కనిపెట్టేశాడంటూ అంతకుముందు చేసిన ఓ ట్వీట్‌ను నెటిజన్లు అప్పట్లో తెగ వైరల్ చేశారు.