సచిన్ తన కెరీర్లో మొత్తం 200 టెస్టులు ఆడాడు. ఇక ద్రవిడ్ కెరీర్ మొత్తంలో 164 టెస్టులు ఆడాడు. ఇద్దరూ వేల పరుగులు చేశారు. ఎన్నోసార్లు అవుటయ్యారు. కానీ వీరిద్దరూ తమ సుదీర్ఘ కెరీర్లో కేవలం ఒక్కసారి మాత్రమే స్టంప్ అవుటయ్యారు. యాష్లీ గైల్స్ ఈ రోజు(శుక్రవారం) 48వ పుట్టిన రోజు సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. తాను సచిన్, ద్రవిడ్‌లను స్టంప్ అవుట్ చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నాడు. 2001లో ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ తొలి ఇన్నింగ్స్‌లో సచిన్‌ను తాను స్టంప్ అవుట్ చేశానని గైల్స్ చెప్పాడు.
ఆ టెస్ట్ మ్యాచ్‌లో 90 పరుగుల వద్ద సచిన్ టెండూల్కర్‌ను స్టంప్ అవుట్ చేశానని చెప్పాడు. అలాగే 2002లో జరిగిన మరో సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ కూడా 148 పరుగుల వద్ద తన బౌలింగ్‌లోనే స్టంప్ అవుట్‌గా పెవిలియన్ చేరాడని గైల్స్ చెప్పాడు. అయితే వారిద్దరూ వారి టెస్ట్ కెరీర్లోనే స్టంప్ అవుట్ కావడం అదే తొలి, ఆఖరి సారని, ఆ తర్వాత ఏనాడూ స్టంప్ అవుట్ కాలేదని, దీంతో తానే తొలి, ఆఖరి సారి వారిద్దరినీ తానే స్టంప్ అవుట్ చేయడం గుర్తుండిపోయిందని చెప్పుకొచ్చాడు.
బ్యాట్స్‌మెన్స్ అవుట్ అవడం సహజం. అలా అవుట్ అవుతూనే మెరుగవుతారు. గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడతారు. అప్పుడు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కుర్రాడయినా.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అయినా.. దీనికి అతీతులేమీ కాదు. అయితే చేసిన తప్పుల నుంచి కొత్త పాఠం నేర్చుకుని మరోసారి ఆ తప్పులు జరగకుండా చూసుకుంటేనే వారు గొప్ప వ్యక్తులు అవుతారు. గొప్ప ఆటగాళ్లుగా చరిత్రలో నిలిచిపోతారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ అయ్యాడన్నా, రాహుల్ ద్రవిడ్ మిస్టర్ డిపెండబుల్, ది వాల్ వంటి బిరుదులు అభిమానుల నుంచి అందుకున్నాడన్నా దానికి కారణం అదే పట్టుదల. దీనికి ఉదాహరణే కెరీర్లో ఒక్కసారే స్టంప్ అవుట్ కావడం. వారు చేసిన తప్పును తెలుసుకోవడంతోనే మరోసారి అలా జరగకుండా చూసుకున్నారు. లెజెండ్స్ అయ్యారు.