సరిగ్గా 14 ఏళ్ల క్రితం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఓ రికార్డ్ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. సరిగ్గా ఇదే రోజున(జూన్ 29) సచిన్ వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఈ ఫార్మాట్‌లో 15 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అప్పుడు సచిన్ నెలకొల్పిన ఆ రికార్డు నేటికీ ఏ ఆటగాడూ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు.
2006లో దక్షిణాఫ్రికాతో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సచిన్.. 106 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు.
సచిన్ భారీ అర్ధశతకంతో.. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 6 వికెట్ల తేడాతో చేసించింది. ఈ క్రమంలోనే సచిన్.. వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని దాటాడు.
ఇదిలా ఉంటే.. 22 ఏళ్ల కెరీర్లో క్రికెట్ ను శాసించిన సచిన్.. 1989, నవంబర్ 15న అందరు ఆటగాళ్లలానే సాధారణంగానే అడుగుపెట్టాడు. అదే ఏడాది డిసెంబరు 18న తొలి వన్డే ఆడాడు.
200 టెస్టుల్లో 68 అర్ధశతకాలు, 51 శతకాల సాయంతో 15,921 పరుగులు సాధించిన సచిన్.. 463 వన్డేల్లో 96 హాఫ్ సెంచరీలు, 49 సెంచరీల సాయంతో 18,426 పరుగులు చేశాడు.
ఇక వన్డే ఫార్మాట్‌లో తొలి ద్విశతకంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకన్న ఈ క్రికెట్ దేవుడు.. 23 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు వన్డే క్రికెట్లో కొనసాగాడు.
ఈ క్రమంలో ఆయన ఆరు వన్డే ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కూడా సచిన్ ఉన్నాడు. అదే అతడి చివరి ప్రపంచకప్ కూడా కావడం గమనార్హం.