ఇటీవల ముగిసిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌లో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ ముగిసిన తరువాత సచిన్ టెండూల్కర్‌తో సహా అనేకమంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డాడు. జట్టు సభ్యులు బద్రీనాథ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్‌లకు కూడా వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరందరూ ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ త్వరగా కోలువాలంటూ పాక్ మాజీ స్పీడ్‌గన్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. మైదానంలో తన ఫేవరేట్ ప్రత్యర్థి అయిన సచిన్ త్వరగా కోలుకోవాలని అక్తర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. సచిన్‌కు తనను తాను ప్రత్యర్థిగా చెప్పుకోవడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.
‘సచిన్ నీకంటే ముందు ఎంతో మంది లెజెండరీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. వకార్ యూనిస్, వసీం అక్రమ్, ఆంబ్రోస్, మెక్‌గ్రాత్, అలెన్ డొనాల్డ్ లాంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లకే సచిన్ చుక్కలు చూపించాడు. అతడి ముందు నువ్వెంత. అతడు ఎదుర్కొన్న బౌలర్లలో నువ్వు కూడా ఓ సాధారణ బౌలర్‌వి అంతే. సచిన్‌కు నీవు ఏ విధంగానూ ప్రత్యర్థివి కావు. వకార్, వసీంలు ఆ మాట అంటే బాగుంటుంది కానీ నీవంటే నవ్వొస్తోంది’ అంటూ అభిమానులు అక్తర్‌ను ట్రోల్ చేస్తున్నారు. 2003 వన్డే ప్రపంచకప్‌లో అక్రమ్, వకార్‌లతోపాటు సచిన్.. నీకు కూడా చుక్కలు చూపించిన విషయాన్ని మర్చిపోయావా..?’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
One of my favorite rivalries on the ground. Get well soon buddy @sachin_rt pic.twitter.com/mAleuepcwM
— Shoaib Akhtar (@shoaib100mph) March 30, 2021
కాగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం అక్తర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. అక్తర్ గొప్ప బౌలర్ అని సచిన్ కూడా ఒప్పుకున్నారని, అయితే క్రమశిక్షణ లేకపోవడం వల్ల అతడు గొప్ప క్రికెటర్ల సరసన చేరలేకపోయాడని, ఎక్కవకాలం ఫాంను కొనసాగించలేకపోయాడని, అంతమాత్రాన అతడి ప్రతిభను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని వెనకేసుకొచ్చారు.