చెన్నై: పీఎల్ 2021లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడిన విషయం తెలిసిందే. స్పిన్ ట్రాక్ కావడంతో తొలుత ఆర్సీబీ బౌలర్లు విజృంభించారు. దీంతో ముంబై జట్టు 8 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఛేజింగ్‌లో ఆర్సీబీ కూడా తడబడింది. చివరి బంతి వరకు పోరాడి విజయం సాధించింది. అయితే ముంబై జట్టులో రోహిత్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా వంటి హార్డ్ హిట్టర్లున్నప్పటికీ వారిని నిలువరించడంలో బెంగళూరు సక్సెస్ అయింది. అయితే అందులో కీలక పాత్ర ఆ జట్టు బౌలర్ హర్షల్ పటేల్ పోషించాడనడంలో సందేహం లేదు. ఐపీఎల్ చరిత్రలో మరే స్టార్ బౌలర్ కూడా ముంబైపై సాధించలేని రికార్డును సాధించి ఔరా అనిపించాడు. 5 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకన్నాడు.
కాగా.. సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టిన ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్‌ను ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల్లో ముంచెత్తాడు. హర్షల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని,
అతడిని టోర్నీ చివరి వరకు కొనసాగిస్తామని కోహ్లీ వెల్లడించాడు. ఐ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. హర్షల్ తమకు లభించిన అత్యుత్తమ బౌలర్ అని అభినందించాడు. ‘‘ఢిల్లీ జట్టు హర్షల్‌ను విడుదల చేయడంతో అతడిని మేం సొంతం చేసుకున్నాం. అతడిపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని హర్షల్ నిలబెట్టాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడి ఆటతీరూ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. మైదానంలో అభిమానులు ఉండుంటే అతడు చేసిన ప్రదర్శనకు స్టేడియం దద్దరిల్లిపోయేది. ఇకనుంచి డెత్ ఓవర్లలో అతడి సేవలు వినియోగించుకుంటాం. ముఖ్యంగా నా అంచనాలను మించి హర్షల్ అదరగొట్టాడనడంలో సందేహం లేద’’ని కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇక హర్షల్‌తో పాటు మిగతా బౌలర్లు కైల్ జేమీసన్, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్ మ్యాచ్‌లు కూడా బాగా బౌలింగ్ చేశారని, ఈ మ్యాచ్‌లో విజయంలో బౌలర్ల పాత్ర ఎంతో కీలకమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అలాగే బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ రాణించడంతో లక్ష్యాన్ని ఛేదించగలిగామని పేర్కొన్నాడు.