ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో చివరి బంతికి పంజాబ్ విజయం సాధించింది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ సెంచరీతో ఒంటరిపోరాటం చేసినా ఓటమి తప్పలేదు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. టోర్నీలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలిసారి 200కు పైగా స్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(91: 50 బంతుల్లో.. 7 ఫోర్లు, 5 సిక్సులు)కు.. క్రిస్ గేల్(40: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 6 సిక్సులు), దీపక్ హుడా(64: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బ్యాట్స్‌మన్ విజృంభణతో పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు, ర్యాన్ పరాగ్ ఓ వికెట్ తీసుకున్నారు.
అనంతరం 222 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ప్రారంభంలోనే భారీ దెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే డేంజరస్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్(0)ను మహ్మద్ షమి అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శాంసన్.. మనన్ వోహ్రా(14)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. కానీ.. నాలుగో ఓవర్లో వోహ్రా అవుట్ కావడంతో శాంసన్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే వోహ్రా తరువాత క్రీజులోకొచ్చిన జోస్ బట్లర్(25: 13 బంతుల్లో 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కానీ అతడిని అరంగేట్ర ఆటగాడు జ్యే రిచర్డ్‌సన్ బౌల్డ్ చేయడంతో రాజస్థాన్ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తరువాత శివమ్ దూబే(23: 15 బంతుల్లో 3 ఫోర్లు), ర్యాన్ పరాగ్(25: 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) కూడా రాణించలేకపోయారు. దీంతో శాంసన్‌కు ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తున్నా అతడికి ఎవరూ సహకారం అందించలేదు.
రాహుల్ తెవాటియా(2: 4 బంతుల్లో) కూడా శాంసన్‌కు అండగా నిలవలేకపోయాడు. కానీ, ఒకపక్క వికెట్లు పడుతున్నా.. శాంసన్ మాత్రం సెంచరీతో కదం తొక్కాడు. బౌండరీలు బాదుతూ.. 18వ ఓవర్లోనే స్కోరును 200 దాటించాడు. దీంతో రాజస్థాన్ గెలుపునకు చేరువైంది. 19వ ఓవర్ వేసిన మెరిడిత్ 8 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీయడంతో ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావల్సి వచ్చింది. ఇక చివరి ఓవర్ వేసిన అర్షదీప్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయండంతో 8 పరుగులే వచ్చాయి. చివరి బంతికి 5 పరుగులు కావల్సి ఉండగా.. శాంసన్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించగా.. బౌండరీ లైన్ వద్ద హుడా దానిని క్యాచ్ పట్టేశాడు. దీంతో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి రాజస్థాన్ ఓటమిపాలైంది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. మహ్మద్ షమి 2, జ్యే రిచర్డ్‌సన్, మెరెడిత్‌లకు చెరో వికెట్ తీసుకున్నారు. అయితే మ్యాచ్‌లో పంజాబ్ గెలిచినా.. సెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడం విశేషం.