ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అదరగొట్టింది. ముంబైలోని వాంఖడే పిచ్‌పై ఈ సీజన్‌ను విజయంతోనే మొదలు పెట్టింది. తొలుత రాజస్థాన్ బ్యాట్స్‌మన్‌ను బెంగళూరు బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టగా.. ఆ తరువాత బ్యాటింగ్‌లో ఓపెనర్లే విజృంభించి విజయాన్ని దక్కించుకున్నారు. కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఆర్సీబీ ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్(101: 52 బంతుల్లో.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో సూపర్ ఇన్నింగ్స్ ఆడగా.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(72: 47బంతుల్లో.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిశాడు. దీంతో ఇప్పటివరకు ఈ సీజన్లో తొలిసారిగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించిన ఏకైక జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. అలాగే మరో 21 బంతులు మిగిలుండగానే.. లక్ష్యాన్ని ఛేదించింది. 16.3 ఓవర్లలో 181 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో ఒక్కరు కూడా కనీసం ఓ వికెట్ కూడా తీయలేకపోవడం గమనార్హం.
కాగా.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ప్రారంభంలోనే తడబడింది. జోస్ బట్లర్(8: 8 బంతుల్లో.. 2 ఫోర్లు), మనన్ వోహ్రా(7: 9 బంతుల్లో.. 1 ఫోర్) వెంటవెంటనే అవుట్ కావడం, వారితో పాటు కెప్టెన్ సంజు శాంసన్(21: 18 బంతుల్లో.. 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలకపోవడంతో రాజస్థాన్ తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయింది. దీనికి తోడు ఇన్ ఫామ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్(0) డకౌట్ కావడంతో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. రాజస్థాన్ జట్టు కనీసం 100 పరుగులైనా చేస్తుందా..? అనే పరిస్థితి ఏర్పడింది.
అయితే మిడిలార్డర్‌లో శివమ్ దూబే(46: 32 బంతుల్లో.. 5 ఫోర్లు, 2 సిక్సులు) జట్టును ఆదుకున్నాడు. అతడికి రియాన్ పరాగ్(25: 16 బంతుల్లో.. 4 ఫోర్లు) కొంత సహకారం అందించాడు. అలాగే చివర్లో రాహుల్ తెవాటియా(40: 23 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) విజృంభించి ఆడడంతో జట్టు స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది.