ఇంటర్నెట్ డెస్క్: ఒక్క మ్యాచ్ గెలవగానే సంజు శాంసన్ తెగ హంగామా చేస్తున్నాడు. ఏకంగా సీనియర్ ఆటగాళ్లకే కౌంటర్లిస్తూ రెచ్చిపోతున్నాడు. తాజాగా ఆదివారం సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అతడు ఏకంగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌నే టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం క్రికెట్ అభిమానుల్లో కలకలం సృష్టిస్తోంది.
హైదరాబాద్ మ్యాచ్‌లో ఘన విజయం తర్వాత శామ్సన్ మాట్లాడుతూ.. ‘మా బౌలర్లు గత 5-6 మ్యాచ్‌ల నుంచి బౌలింగ్ బాగా వేస్తున్నారు. వారి బౌలింగ్ ప్రదర్శనతో గర్వంగా ఉంది. స్పెషలిస్టు బౌలర్లున్న జట్టుకు సారథ్యం వహించడం ఆనందంగా ఉంది. మీరు రిజల్ట్స్‌ను చూసినట్లయితే మేము ఎక్కువ మ్యాచ్‌లు గెలవలేదు. కానీ మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఐపీఎల్ అనేది ఫన్నీ టోర్నమెంట్. ఒక వ్యక్తి, ఒక బాల్, ఒక ఓవర్‌తో గేమ్‌ను ఛేంజ్ చేయవచ్చ’ని సంజూ అన్నాడు.
తాను ఫామ్‌లో ఉన్నానా..? లేదా..? అనేది అసలు విషయమే కాదని, తాను నిలకడగా ఆడుతున్నానా..? లేకపోతే 30-40 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవుతున్నానా..? అనే దాని గురించి తానెప్పుడూ పట్టించుకోనని, జట్టు బాగా ఆడటమే ప్రధాన అంశమని సంజూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఏ సమయంలోనైనా జట్టులోని ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలని, జట్టులోని ప్రతీ ఆటగాడినీ వెన్నుతట్టి ముందుకు నడపించే బాధ్యత కెప్టెన్‌గా తనపై ఉంటుందని, అప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతామని సంజూ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే రాజస్థాన్ కెప్టెన్‌గా సంజూ స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదని, అతడు కనీసం 30-40 పరుగులు కూడా చేయలేకపోవడం ఏంటని గంభీర్ ఇటీవల విమర్శలు గుప్పించాడు. అంతకుముందు మూడు మ్యాచ్‌లలో 0, 1, 6 పరుగులు మాత్రమే శాంసన్ చేశాడని, ఇలా ఔటైతే జట్టును ముందుకులా నడిపిస్తాడంలూ సంజూ ఆటతీరును తప్పుబట్టాడు. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే సంజూ తాజా మ్యాచ్ అనంతరం ఇలా మాట్లాడాడని అర్థమవుతోంది.
దీంతో గంభీర్ ఫ్యాన్స్ సంజూపై మండిపడుతున్నారు. ‘ఒక్క మ్యాచ్ గెలవగానే.. గంభీర్‌కు కౌంటర్ ఇచ్చే స్థాయికి ఎదిగావా..?’ అంటూ మండిపడుతున్నారు. ఇంకొందరు మాత్రం సీనియర్లు ఇచ్చే సూచనలను ప్రతి యువ ఆటగాడూ తన కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఉపయోగించుకోవాలని, అంతేకానీ వారిని విమర్శిస్తే చివరికి ఏమీ మిగలదంటూ సంజూ తీరును విమర్శించారు.