ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. వరుస ఓటముల నేపథ్యంలో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా ఏకంగా తుది జట్టు నుంచి తొలగించడం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఆ జట్టు మాజీ పేసర్ డేల్ స్టెయిన్ వార్నర్ తొలగింపుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. యాజమాన్యాన్ని నేరుగా తప్పుబట్టకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం నేరుగా ప్రశ్నించాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ తొలిసారిగా కెప్టెన్సీని కోల్పోయాడు. కెప్టెన్‌గానే కాకుండా ఏకంగా తుది జట్టులో కూడా అతడికి స్థానం దక్కలేదు. డగౌట్‌లో టవల్స్ మోసుకుంటూ కూర్చుండిపోయాడు. దీంతో వార్నర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భుజంపై టవల్ వేసుకుని డగౌట్‌లో కూర్చున్న వార్నర్‌ను చూసిన అభిమానుల ఆగ్రహం తీవ్రమవుతోంది. జట్టుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్‌ను ఇంతలా అవమానిస్తారా..? అంటూ మండిపడుతున్నారు. క్రికెట్ విశ్లేషకులు కూడా దీనిపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డెయిల్ స్టెయిన్ కూడా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తనకు తెలిసినంతవరకు డేవిడ్ వార్నర్‌ను ఇకపై సన్‌రైజర్స్ జెర్సీలో చూడలేకపోవచ్చు’ అంటూ డేల్ స్టెయిన్ సంచలన కామెంట్స్ చేశాడు. యాజమాన్యం నిర్ణయాన్ని డేవిడ్ ప్రశ్నించాడో లేదో తనకు తెలియదని, అయితే తాజా పరిణామాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నాడు. ‘మనీష్ పాండేను జట్టులోకి తీసుకోవడంపై వార్నర్, మేనేజ్‌మెంట్ మధ్య ఎలాంటి వివాదం రేగింతో నాకు తెలియదు. కానీ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవచ్చు.
అయితే కెప్టెన్‌గా తప్పనిసరి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎవరు తుదిజట్టులో ఉంటారు..? ఎవరిని పక్కన పెట్టాలి..? అనే అంశాలపై స్పష్టత ఉండాలి. అయితే, ఒక్కోసారి పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. వార్నర్ విషయంలో కూడా అదే జరిగిందనిపిస్తోంది. మొత్తానికి తెరవెనుక ఏదో జరిగిందనే విషయం అర్థమవుతోంది’ అని స్టెయిన్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా కెప్టెన్‌ను మార్చి మరీ రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన సన్ రైజర్స్ ఇంతకుముందుకంటే దారుణ ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బౌలింగ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచి, ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ పేలవ ఆటతీరుతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఏకంగా 55 పరుగుల తేడాతో ఓటమి పాలై దారుణ పరాభవాన్ని మిగుల్చుకుంది. ఈ నేపథ్యంలో వార్నర్‌ను కాదని నబీని జట్టులోకి తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారంటూ వార్నర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.