ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. వరుస ఓటముల నేపథ్యంలో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా ఏకంగా తుది జట్టు నుంచి తొలగించడం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కోచ్ ట్రెవొర్ బెయిలిస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇక ఈ సీజన్లో వార్నర్ మళ్లీ ఆడే అవకాశం లేదనే విధంగా ఆయన మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కోచ్ వ్యాఖ్యలతో వార్నర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. సన్‌రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కచ్చితంగా ఏదో జరిగిందని, దాని కారణంగానే వార్నర్‌ను యాజమాన్యం జట్టులో నుంచి తొలగించిందని అభిప్రాయపడుతున్నారు. ‘ఈ సీజన్లో వార్నర్ కెప్టెన్‌గా విఫలం కావొచ్చు కానీ ఆటగాడిగా కూడా పనికిరాడా..?’ అంటూ మండిపడుతున్నారు. జట్టుకు ట్రోఫీని సైతం అందించిన ఆటగాడిని ఇంత దారుణంగా అవమానిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రైజర్స్ ఓటమిలను చూస్తే జట్టులో ఆటగాళ్లందని పేలవ ప్రదర్శన కారణంగానే ఓడిందని, ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు తప్ప మిగతా జట్టంతా అత్యంత పేలవంగా ఆడుతుంటే ఇక విజయాలు ఎలా వస్తాయిని ప్రశ్నిస్తున్నారు.
మాజీ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక వార్నర్ ఆరెంజ్ ఆర్మీలో కనిపించకపోవచ్చని, అతనికి ఈ సీజన్‌తో వారితో బంధం తీరిపోయిందని కొంతమంది బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ ఫైవ్ ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ ఉన్నాడని, అతణ్ని తుది జట్టులో నుంచి తప్పించడం వెనుక పెద్ద కారణమే ఉండి ఉంటుందని ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఏకైక ఆటగాడు వార్నర్ అని, అతడు ఈ సీజన్లో ఫాంలో లేకపోయినా, మిగతా ఆటగాళ్లకు అండగా ఉండగలడని, అలాంటిది అతడిని తుది జట్టులో నుంచి తప్పించడం తనకు షాక్‌కు గురి చేసిందని లీ అన్నాడు. ఇది అతడిని అవమానించినట్లేనంటూ వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ స్థానంలో వచ్చింది మహ్మద్ నబీని జట్టులోకి తీసుకున్నారు. అయితే ఐపీఎల్‌లో అతని రికార్డు ఎంత పేలవంగా ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన నబీ కేవలం 177 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 31. యావరేజ్ 16.09గా ఉంది. బౌలర్‌గా 13 వికెట్లు మాత్రమే తీశాడు. అంటే మ్యాచ్‌కు ఒక్కటి కూడా లేదు.
ఇక ఈ సీజన్‌లో నిన్నటి మ్యాచ్‌తో కలుపుకుని 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కేవలం రెండు వికెట్లే సాధించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌కే పరిమితమైన నబీ.. ఆ ఓవర్లోనే అన్ని ఓవర్లకూ సరిపడా 21 పరుగులు సమర్పించుకున్నాడు. బట్లర్, శాంసన్ దెబ్బకు నబీని ఓవర్‌కే పరిమితం చేశాడు కొత్త కెప్టెన్ విలియమ్సన్. దీంతో ఒక్క ఓవర్ బౌలర్ కోసం వార్నర్‌ను పక్కన పెడతారా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వార్నర్ వంటి బ్యాట్స్‌మన్ ఉండి ఉంటే కచ్చితంగా ఉపయోగపడేవాడని అభిప్రాయపడుతున్నాడు. వార్నర్ లేకపోతే ఇకముందు కూడా ఇదే తరహా ఓటములు రైజర్స్‌కు తప్పవని అంటున్నారు.