భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రతి రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగడంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోయినా ఆశ్చర్యం లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు కూడా దుబాయ్‌లో టోర్నీ నిర్వహించడంపై అభిప్రాయాలు వెలిబుచ్చడంతో భారత్‌లో టోర్నీ జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో నెలకొన్నాయి.
నిజానికి 2020లో ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించాల్సిన ఈ మెగా టోర్నీ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆ టోర్నీని ఈ ఏడాదికి వాయిదా వేసింది. అయితే ఆసీస్.. దీనిపై తమ అభ్యంతరాలను వెలిబుచ్చుతూ.. ‘కరోనా నేపథ్యంలో తాము ఈ టోర్నీని 2021లో కూడా నిర్వహించలేం. అవసరమైతే ఆ తదుపరి ఏడాది టోర్నీ బాధ్యతలు తీసుకుంటాం’ అని ఐసీసీకి విన్నవించింది. దీంతో ఐసీసీ.. ఆ బాధ్యతను భారత్‌కు అప్పగించింది. దీనికి అంగకరించిన భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ల మధ్య టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టింది.
ఈ టోర్నీ నిర్వహించేందుకు కావలసిన హక్కులను కూడా బీసీసీఐ సొంతం చేసుకుంది. అయితే, మన దేశంలో ఇప్పుకు అనుకోకుండా కరోనా సెకండ్ వేవ్ రావడం, దేశ వ్యాప్తంగా రోజూ 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కావడం, కరోనా మరణాలు కూడా పెరుగుతుండటంతో ఇప్పుడు ఈ టోర్నీ భారత్‌లో జరుగుతుందా..? లేక వేదిక మారుతుందా..? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వేదికను మార్చే దిశగా బీసీసీఐ సమాలోచనలు చేస్తోందంటూ ప్రచారం కూడా మొదలైంది.
వేదిక మార్పు గురించి బీసీసీఐ జనరల్ మేనేజర్, టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ డైరెక్టర్ ధీరజ్ మల్హోత్రా మాట్లాడారు. ‘వరల్డ్ కప్ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందనుకుంటున్నారు. కానీ, ఒకవేళ దేశంలో పరిస్థితి అక్టోబర్ నాటికి కూడా ఇలాగే కొనసాగితే టోర్నీని యూఏఈకి తరలించేందకు సమాలోచన చేస్తున్నాం. అయితే, హక్కులు మాత్రం బీసీసీఐకే ఉంటాయి’ అని స్పష్టం చేశారు. మల్హోత్రా వ్యాఖ్యలతో ఈ మెగా టోర్నీ దేశం నుంచి తరలిపోతుందేమోనని అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు.