టీమిండియాతో జరిగిన తొలి వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కుడి చేతి వేలికి తీవ్ర గాయమైంది. చాలా రక్తం పోయింది. దీంతో వెంటనే మైదానాన్ని వీడాడు. ఇక బ్యాటింగ్ సమయంలో వరుస వికెట్లు తప్పనిసరి పరిస్థితుల్లో చేతికి మూడు కుట్లు పడ్డాయి. ఆ దెబ్బతోనే బ్యాటింగ్ చేశాడు. కానీ అంతగా రాణించలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇక గాయం పెద్దదిగా ఉండడంతో జట్టు యాజమాన్యం అతడిని తదుపరి వన్డే సిరీస్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దీంతో మిగతా రెండు వన్డేలకు అతడు పూర్తిగా దూరం కానున్నాడు. అతడి గైర్హాజరీలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ మిగిలిన వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
‘తొలి వన్డే నేపథ్యంలో ఇయాన్ మోర్గాన్ చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు మిగిలిన రెండు వన్డేలకూ దూరం కానున్నాడు. అతడికి బదులుగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ మిగిలిన రెండు వన్డేల్లో జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడు’ అని ఇంగ్లండ్ జట్టు మేనేజ్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. కాగా వన్డే సిరీస్ ప్రారంభంలోనే ఆర్చర్ జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు మోర్గాన్ కూడా దూరం కావడంతో ఆ జట్టుకు మరో దెబ్బ తగిలినట్లైంది.
ఇదిలా ఉంటే తొలి వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. శిఖర్ ధవన్(98), కెప్టెన్ విరాట్ కోహ్లీ(56), కేఎల్ రాహుల్(62), కృనాల్ పాండ్యా(58) వరుస అర్థసెంచరీలు చేయడంతో ఏకంగా 317 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఓపెనింగ్ లభించినా.. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. ఓపెనర్లు జేసన్ రాయ్(46), జానీ బెయిర్ స్టో(94) మాత్రమే ధాటిగా ఆడారు. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో 42.1 ఓవర్లలో 251 పరుగులకే జట్టు ఆలౌట్ అయింది. దీంతో 66 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.