ఇండియాతో ఇటీవల టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక టీ20 సిరీస్‌లో అంతంతమాత్రగా ఆడాడు. వన్డే సిరీస్‌లో మాత్రం విజృంభిస్తున్నాడు. అతడే ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టో. వన్డే సిరీస్‌తో తొలి రెండు వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో సెంచరీకి కొద్ది దూరంలో 94 పరుగుల వద్ద అవుటైన బెయిర్ స్టో.. రెండో వన్డేలో మాత్రం ఏకంగా 124 పరుగులతో చెలరేగాడు. జట్టుకు చారిత్రక విజయాన్ని అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు. తనలోని భీకరమైన హిట్టర్‌ను బయటకు తీశాడు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన బెయిర్ స్టో టీమిండియా లెజెండ్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌పై కొన్ని కామెంట్లు చేశాడు.
టెస్ట్ సిరీస్‌లో బెయిర్ స్టో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో అప్పట్లో టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అతడి ఆటతీరును విమర్శించాడు. టెస్టు మ్యాచ్ ఆడే సమయంలో క్రీజులో ఉండడానికి బెయిర్ స్టో ఆసక్తి చూపించడం లేదని, అందుకే వెంటనే అవుటైపోతున్నాడని విమర్శలు చేశాడు. అయితే అప్పట్లో ఈ వ్యాఖ్యలపై బెయిర్ స్టో స్పందించలేదు. కానీ తాజాగా వన్డేల్లో అదిరిపోయే ఫాంతో దూసుకుపోతుండడంతో బెయిర్ స్టో బయటపడ్డాడు. అప్పటి గవాస్కర్ వ్యాఖ్యలపై సెటైరికల్ కామెంట్స్ చేశాడు. తనకు గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు గురించి అప్పుడు తెలియదని, ఒకవేళ తెలిసి ఉంటే అప్పుడే సమాధానమిచ్చేవాడినని అన్నాడు. గవాస్కర్ లెంజెండ్ అని అంటూనే.. క్రీజులో నిలబడేందుకు ఏమైనా సలహాలుంటే ఫోన్ చేసి ఇవ్వాలని, తన మొబైల్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుందని చురకలేశాడు.
`గవాస్కర్ నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు నాకు తెలియదు. తెలిసి ఉంటే వెంటనే స్పందించేవాడిని. ఏదేమైనా ఒక లెజెండరీ క్రికెటర్ ఇచ్చే విలువైన సలహాల కోసం ఎదరుచూస్తున్నా. టెస్టు క్రికెట్‌లో కుదురుగా ఆడడానికి ఏం చేయాలో ఆయన నాకు సలహాలు ఇవ్వొచ్చు. నాకు కాల్ అయినా చేయొచ్చు లేదా మెసేజ్ అయినా పంపొచ్చు. నా ఫోన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంద`ని బెయిర్ స్టో పేర్కొన్నాడు. కాగా.. తొలి రెండు వన్డేల్లో రాణించిన బెయిర్ స్టో ఇండియా లెజెండరీ క్రికెటర్‌పైనే కామెంట్లు చేశాడు మరి రేపు(ఆదివారం) జరగబోయే మూడో వన్డేలో కూడా ఇదే తరహాలో ఆడతాడో లేదో చూడాలి.