టీమిండియా-ఇంగ్లాండ్ జట్లు మధ్య 5 టీ20ల సిరీస్ శుక్రవారం నుంచి మొదలు కానుంది. తొలి మ్యాచ్ శుక్రవారం సాయంత్రం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా విపరీతంగా ప్రాక్టీస్ చేస్తోంది. కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో క్రికెటర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తూ కష్టపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘మ్యాచ్‌కోసం సన్నద్ధత పూర్తయింది. 12న మైదానంలోకి అడుగు పెట్టేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానం’టూ అందులో తన పోస్టులో పేర్కొన్నాడు.
ఆసీస్ పర్యటనలో ఆడిన టీ20ల్లో పాండ్యా అద్భుతగా ఆడిన విషయం తెలిసిందే. రెండు టీ20ల్లో టీమిండియా విజయంలో పాండ్యాది కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. దీంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పాండ్యా ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. దీంతో మళ్లీ టీ20ల్లో తన సత్తా చాటాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.
ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీసులో పరిమితంగా బౌలింగ్ చేసిన పాండ్యా, ఇంగ్లాండ్ టీ20 సిరీసులో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాడట. ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయకపోయానా.. ఈ రోజు ప్రాక్టీస్‌లో మాత్రం ఒకప్పటి వేగంతో బౌలింగ్ చేయడం చూస్తుంటే టీ20ల్లో అతడి చేతికి కచ్చితంగా బంతి వెళుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెట్స్‌లో అతడి ప్రాక్టీస్‌ను రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ దగ్గరుండి పరిశీలించారు. అలాగే కాకుండా భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్ కూడా ఈ రోజు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.