ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించడమే కాకుండా సిరీస్‌ను సైతం పట్టేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అనేక తప్పులు చేసినా చివర్లో నటరాజన్ వేసిన అద్భుతమైన ఓవర్‌తో చారిత్రాత్మక విజయం సాధించింది. అయితే అంత గొప్పగా బౌలింగ్ చేసిన నటరాజన్‌ను అంతా మర్చిపోయారు. కెప్టెన్ కోహ్లీతో పాటు మాజీలు కూడా మర్చిపోయారు. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ప్రత్యేకంగ ప్రస్తావించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వాన్.. ‘మూడో వన్డేలో టీమిండియా బౌలర్ నటరాజన్ అద్భుతమైన యార్కర్లతో మాయ చేశాడు. ఆ ఓవర్ వేసే సమయంలో నటరాజన్ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో ఊహించడం కష్టమే. ఆఖరి ఓవర్లలో తక్కువ ఎత్తులో యార్కర్లు సంధించడం అద్భుతమైన కళ. అదే నటరాజన్ బలం కావడం గొప్ప విషయం. సరైన బంతులు విసిరి మ్యాచ్‌ను గెలిపించిన నటరాజన్‌ను ఎంత అభినందించినా తక్కువేన’ని నట్టూను ఆకాశానికెత్తేశాడు. అయితే ఇంగ్లండ్‌పై భారత్ గ్రాండ్ విక్టరీకి నటరాజన్ వేసిన చివరి ఓవర్ కారణమనే విషయం టీమిండియా మర్చిపోయిందని చురకలంటించాడు.
కాగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు భువనేశ్వర్ 3 వికెట్లు తీసి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక శార్దూల్ ఠాకూర్ మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసుకున్నాడు. వీరితో పాటు నటరాజన్ కూడా 2 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఫీల్డింగ్ పరంగా మాత్రం టీమిండియా చాలా దారుణ ప్రదర్శన చేసింది. పలువురు ఫీల్డర్ సునాయాసమైన క్యాచ్‌లను సైతం నేలపాలు చేయడంతో మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది.