వెల్లింగ్టన్: క్రికెట్ లవర్స్ ఏడాదంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసే సమయం రానే వచ్చింది. భారత్ లోని మైదానాలు సరికొత్త హంగులతో సిద్ధమవుతున్నాయి. విదేశీ ఆటగాళ్లు కూడా అంతకుమించి రెడీ అవుతున్నారు. 2021 ఐపీఎల్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మి నీషమ్, ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మధ్య ట్విటర్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. అసలు విషయంలోకి వెళితే.. ఐపీఎల్ సీజన్14లో నీషమ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే.
కాగా ట్విటర్‌లో నీషమ్‌ను ఐపీఎల్ అభిమాని ఒక ప్రశ్న అడిగాడు. ”నీషమ్.. ఐపీఎల్ త్వరలో ప్రారంభమవుతుంది.. ముంబై జట్టుతో ఎప్పుడు వచ్చి చేరుతున్నావ’ని ప్రశ్నించాడు. దానికి నీషమ్.. ”నేను ఐపీఎల్‌కు వస్తున్నా.. కానీ కార్గో షిప్ వల్ల ఇప్పుడు సుయాజ్ కాలువలో చిక్కుకుపోయా.. త్వరలోనే బయటపడుతా” అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. నీషమ్ ఇచ్చిన సమాధానానికి మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.
నీషమ్..” 46, 44, 46 ఈ బరువులు నీ బ్యాగ్‌లో మోస్తూనే ఉన్నావా.. అందుకే చిక్కుకుపోయావా” అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ అర్థంకాక అభిమానులు జుట్టు పీక్కున్నారు. అయితే మ్యాక్సీ అలా పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. కివీస్, ఆసీస్ మధ్య జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా మూడో టీ20లో మ్యాక్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో 70 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్ నీషమ్ బౌలింగ్ లో ఉతికారేశాడు. ఒకే ఓవర్లో వరుసగా 4,6,4,4,4,6 బాది 28 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించగా.. ఓవరాల్‌గా మాత్రం న్యూజిలాండ్ 3-2 తేడాతో సిరీస్ దక్కించుకుంది. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత జిమ్మి నీషమ్, మ్యాక్స్‌వెల్‌లు తమ జెర్సీలను ఒకరిదొకరు మార్చకున్న సంగతి తెలిసిందే.