ముంబై: ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అతడు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దాంతో ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో అతడి కోసం జట్లు భారీగా పోటీ పడతాయని భావించారు. కానీ అందరి ఊహాతీతంగా మలాన్ ను కొనేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. చివరికి పంజాబ్ కింగ్స్ మలాన్‌ను రూ. 2 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించి దక్కించుకుంది. అలా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన మలాన్ పంజాబ్ జట్టుతో కలిశాడు. కరోనా నిబంధనల ప్రకారం ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉన్న మలాన్ జట్టులో తన స్థానం గురించి మాట్లాడాడు.
”జట్టులో ఏ స్థానంలో ఆడటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను అంతర్జాతీయ అరంగేట్రం చేసే సమయానికి జట్టులో మూడోస్థానం ఖాళీగా ఉంది. దాంతో ఆ స్థానంలోనే కొనసాగాను. ఓపెనింగ్ చేయాలన్న కోరిక బలంగా ఉండేది, కాని అది జరగలేదు. అయితే ఐపీఎల్ అరంగేట్రం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఇప్పుడు రాహుల్ సారధ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. తుది జట్టులో ఉంటే మూడో స్థానంలోనే ఆడుతానని అస్సలు అనను. ఏ స్థానంలో అయినా ఆడటానికి సిద్దంగా ఉన్నాను.
అయితే ఐపీఎల్‌లాంటి క్యాష్ రిచ్‌లీగ్‌లో ఆడాలని ఎప్పటినుంచో నాకున్న బలమైకోరిక కానీ ఇంగ్లండ్ తరపున టెస్టులో ఆడాలన్నది నా ప్రథాన ఆశయం. ఐదు రోజుల సంప్రదాయ ఆటలో ఉండే నైపుణ్యం ఎన్ని టీ20 మ్యాచ్‌లాడిన సొంతం చేసుకోలేం. అందుకే నా దృష్టిలో టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తా. ఇక ఐపీఎల్‌లో అవకాశమిస్తే మాత్రం నా శైలి ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాన”ని చెప్పుకొచ్చాడు. కింగ్స్ పంజాబ్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరగనుంది.