గతేడాది కరోనా కారణంగా ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే సందేహాలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) మాత్రం ఎలాగోలా పక్క దేశంలో ప్రేక్షకులు లేకుండానే టోర్నీని కానిచ్చేసింది. అది కూడా ఏడాది ప్రారంభంలో జరగాల్సిన టోర్నీని, ఏడాది చివరిలో యూఏఈ వేదికగా నిర్వహించింది. అయితే ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ట్రోఫీని కైవసం చేసుకున్న జట్లలో టాప్ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్ ఉంటే.. రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది. అయితే గత సీజన్‌లో సీఎస్‌కే అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. 6 విజయాలు మాత్రమే సాధించి, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే సీఎస్‌కేకు ఇది దారుణ రికార్డు.
ఇక శుక్రవారం నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సారైనా అదిరిపోయే ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకోవాలని సీఎస్కే పట్టుదలగా ఉంది. అందులో భాగంగా విపరీతంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆటగాళ్లంతా మైదానంలో చెమటోడుస్తున్నారు. బుధవారం కూడా చెన్నై శిబిరంలో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. అందులో చెన్నై కెప్టెన్ ఎంఎస్, ధోనీ, వైస్ కెప్టెన్ సురేశ్ రైనాలు చెలరేగి ఆడారు. బౌండరీలతో విరుచుకు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుదవారం సీఎస్‌కే జట్టు రెండుగా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ కూల్ ధోనీతో పాటు సురేష్ రైనా, పుజారా, డ్వేన్ బ్రావో, జడేజా, సామ్ కర్రాన్ తదితరులు అద్భుతంగా ఆడి సత్తా చాటారు. ఇందులో ధోనీ, రైనాలు బ్యాటింగ్‌లో ఒకప్పటి మెరుపులు కనిపించాయి. ప్రధానంగా ధోనీ తన మార్క్ షాట్లతో బౌండరీల మోత మోగించాడు. హెలికాప్టర్ షాట్, స్క్వేర్ కట్ వంటి కళాత్మక షాట్లతో అలరించాడు. కీపింగ్‌లోనూ తన స్టైల్ చూపించాడు. దీపక్ చాహర్ వేసిన ఓవర్‌లో రాబిన్ ఊతప్పను ధోని స్టంప్ అవుట్ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇక రైనా కూడా తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.