సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ట్విటర్లో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా తన తల్లిని గుర్తు చేసుకుంటూ రషీద్ ఈ ట్వీట్ చేశాడు. తాను రంజాన్ జరుపుకొంటున్నానని, కానీ తన తల్లికి దూరంగా తొలి సారి పండుగ జరుపుకొంటున్నానని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అతను జట్టుతో పాటు చెన్నైలో ఉంటున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే రంజాన్ ఉపవాస దీక్ష ప్రారంభించిన రషీద్.. తల్లి సమాధి వద్ద నమాజ్ చేస్తోన్న పాత ఫొటోను తన ట్వీటర్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోపై అత్యంత ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టాడు.
‘నా జీవితానికి సరిపడేంతటి విలువలను మా అమ్మ నేర్పించింది. కానీ ఆమె లేకుండా జీవించడం ఎలాగో తన మనసు ఇప్పటికీ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. ఆమె కోసం నా గుండె ఎల్లప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. తల్లి ఇక తిరిగి రాదనే విషయం నా ఆత్మకు తెలుసు. నా వరకు ఈ ప్రపంచంలో తల్లిని మించిన విలువైన సంపద లేద’ని ఉద్వేగపూరితమైన మెసేజ్ పోస్ట్ చేశాడు. కాగా.. రషీద్ ఖాన్ తల్లి గత ఏడాది జూన్‌లో మరణించారు. అప్పుడు కూడా రషీద్ చాలా ఉద్వేగానికి గురయ్యాడు.
ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. ఏ మాత్రం ఆశించిన స్థాయి ప్రదర్శన చేయడం లేదు. ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్ శనివారం తన మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోబోతంది. మరి ఈ సారి ముంబైను ఓడించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరుస్తుందా..? లేక తొలి రెండు మ్యాచ్‌లలానే ఈ సారి కూడా ఓటమి చవి చూస్తుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.