ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ ఆటగాడిగా ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. అయితే ఈ రికార్డును సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డు అధిగమించాడు. అలాగే ఐపీఎల్‌లో 4000 పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు. రోహిత్ కంటే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 6049 పరుగులు చేశాడు. ఎంఎస్ ధోని 5872 పరుగులు, గౌతమ్ గంభీర్ 4272 పరుగులతో ముందున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శనివారం జరిగిన మ్యాచులో రోహిత్ ఈ రెండు రికార్డులనూ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4వ ఓవర్లో కొట్టిన సిక్స్‌తో ఐపీఎల్‌లో రోహిత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య 217కు చేరింది. దీంతో 216 సిక్సర్లతో ఉన్న ధోనీ రికార్డును రోహిత్ అధిగమించాడు. ఈ జాబితాలో ఇప్పుడు తొలి స్థానాన్ని రోహిత్ ఆక్రమించగా.. ధోనీ రెండో స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీ(201), సురేష్ రైనా(198) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఇక లీగ్‌లో క్రిస్ గేల్ పేరిట అత్యధిక సిక్సర్లు(351) కొట్టిన రికార్డు ఉంది.
ఇదిలా ఉంటే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో కొద్దిగా తడబడి 150 పరుగులే చేసినా.. అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్ కైవసం చేసుకుంది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రౌజర్స్‌ను 19.4 ఓవర్లలోనే 137 పరుగులకే ఆలౌట్ చేసి అదరగొట్టింది. 13 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్ 3 వికెట్లతో రాణించగా, జస్ప్రిత్ బుమ్రా ఓ వికెట్ తీశాడు. అయితే బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3.50తో బెస్ట్ ఎకానమీ నమోదు చేశాడు. ఈ విజయంతో ముంబై.. టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో టాప్‌కు చేరింది.