తప్పులు మానవ సహజం. అయితే తప్పులు జరిగినప్పుడు విమర్శలూ సహజం. అయితే అవతలి వారు విమర్శలు చేసే వరకు ఎందుకు మనమీద మనమే విమర్శలు చేసుకుని, పంచ్‌లు వేసుకుని, ట్రోల్స్ చేసుకుంటే మరొకరికి ఆ అవకాశం ఉండదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి అలాగే ఉంది. బెంగళూరు చేతిలో చావు దెబ్బ తిని దారుణ ఓటమి చవి చూసిన తరువాత భారీ విమర్శలు ఎదురవుతాయని అనుకుందో ఏమో.. రాజస్థాన్ యాజమాన్యం తమపై తామే ట్రోల్స్ చేసుకుంది. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ పడిక్కల్ మెరుపు సెంచరీకి తోడు కోహ్లి కూడా అద్భుతంగా ఆడడంతో పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఓటమితో రాజస్తాన్ రన్‌రేట్ దారుణంగా పడిపోవడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అయితే తాము ఓడిపోయామన్న బాధలో ఆ జట్టు ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టింది. ”డైరెక్టెడ్ బై రాబర్ట్ బి. వెయిడ్” అనే ఓ మీమ్‌ను ఆ ట్వీట్‌లో షేర్ చేసింది. అయితే ఈ మీమ్ అర్థమైనవారు నవ్వుకుంటున్నారు. ఇంతకీ దీనర్థం ఏంటంటే.. ఎప్పుడైనా ఆఖర్లో దెబ్బ తింటే ఇలాంటి పదాన్ని వినియోగిస్తారు. దీనర్థం ఫెయిల్యూర్ అని. రాజస్తాన్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా తమ స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇంత దారుణంగా ఓడిపోతామని ఊహించి ఉండరు.. అందుకే ఈ మీమ్‌ను షేర్ చేశారు.. అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, మరో నెటిజన్ ఏమో.. ‘ఈ సారి ముందుగా ఇంటికెళ్లేది తామేనని తెలిసిపోయినట్లుంది’ అంటూ సెటైర్లు వేశాడు.
— Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2021
ఇదిలా ఉంటే ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒకదశలో బెంగళూరు బౌలర్ సిరాజ్ (3/27) ధాటికి 43/4తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్‌ను శివమ్ దూబే (46; 32 బంతుల్లో.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ తెవాటియా ( 40; 23 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు. 178 పరుగుల ఛేజింగ్‌లో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ అజేయ శతకం(101 నాటౌట్; 52 బంతుల్లో.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కదం తొక్కగా… కెప్టెన్ విరాట్ కోహ్లీ(72 నాటౌట్; 47 బంతుల్లో.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరో ఎండ్‌లో పాతుకుపోయాడు. దీంతో 16.3 ఓవర్లలోనే ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు స్థాయి విజయాన్ని కైవసం చేసుకుంది.