ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ దారుణ ప్రదర్శనతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే శివమ్ దూబే, రాహుల్ తెవాటియాలు ఆదుకోవడంతో ఎలాగోలా 177 పరుగులు చేసింది. అయితే బౌలర్లు మరింత ఘోరంగా ఆడారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆర్సీబీ సునాయాసంగా విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే ఇద్దరు ఓపెనర్లు కలిసి ఛేదించారు. దీంతో రాజస్థాన్ ఆటతీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞ్యాన్ ఓఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజస్థాన్ బౌలర్లకు, ఫీల్డర్లకు మధ్య కనీస సమన్వయం కూడా లేదని, ఓటమికి అదే కారణమని ఓఝా అన్నాడు.
‘రాజస్తాన్ రాయల్స్ ప్రదర్శనను విమర్శించకుండా ఉండలేకపోతున్నా. ఇంత చెత్త ప్రదర్శన ఎన్నడూ చూడలేదు. ముఖ్యంగా టాపార్డర్ అత్యంత బలహీనంగా తయారైంది. టాపార్డర్ బలంగా ఉన్నప్పుడే మిడిలార్డర్ నుంచి కూడా పరుగులు ఆశించగలం. 30 పరుగులలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టను శివమ్ దూబే, తెవాటియాలు తమ ఇన్నింగ్స్‌తో నిలబెట్టే ప్రయత్నం చేశారు. వారి పోరాటంతోనే అంత స్కోరైనా బోర్డుపై నమోదైంది. కానీ శివమ్ దూబే అవుటైన విధానాన్ని కూడా నేను సమ్మతించను. అతను ఆ షాట్‌ను ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదు. దూబే అవుట్ అవ్వడానికి ముందు ఆ జట్టు కోచ్ సంగక్కర వచ్చి వెళ్లాడు. అతను ఏం చెప్పాడో.. దూబే ఏం విన్నాడో వారిద్దరికే తెలియాలి. ఇక ఆర్‌సీబీ బ్యాటింగ్ సమయంలో బౌలర్లు, ఫీల్డర్లకు పొంతన లేకుండా పోయింది. వీళ్లు కనీసం కమ్యునికేషన్ లేకుండా మ్యాచ్‌ను ఆడేశారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం లీగ్ నుంచి మొదటగా నిష్క్రమించేది రాజస్తాన్ రాయల్స్. అందులో నాకెలాంటి సందేహం లేదు’ అని ఓఝా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒకదశలో బెంగళూరు బౌలర్ సిరాజ్ (3/27) ధాటికి 43/4తో రాజస్తాన్ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో శివమ్ దూబే(46; 32 బంతుల్లో.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ తెవాటియా(40; 23 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కష్టపడి బోర్డుపై 177 స్కోరు ఉంచి.. జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించారు. ఇఖ 178 పరుగుల ఛేజింగ్‌లో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ అజేయ శతకం(101 నాటౌట్; 52 బంతుల్లో.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో సూపర్ సెంచరీ బాదగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(72 నాటౌట్; 47 బంతుల్లో.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి సహకరించాడు.