ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్థాన్ టీమ్ కష్టాల్లో పడింది. దీంతో ఆటగాళ్లను అప్పివ్వాలంటూ మిగిలిన ఫ్రాంఛైజీలను రాజస్థాన్ రాయల్స్ వేడుకుంటోంది. ఈ మేరకు ఐపీఎల్ నిబంధనలను అనుసరించి అన్ని ఫ్రాంఛైజీలకు లేఖలు రాసింది. ఐపీఎల్ ఆడటానికి భారత్‌కు వచ్చిన విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరూ బయోబబుల్ ఉండలేక స్వదేశం బాట పడుతుండడంతో ఇప్పుడు రాజస్థాన్ పరిస్థితి ఇలా తయారైంది. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ముందుగానే టోర్నీకి దూరం కాగా, బెన్‌స్టోక్స్ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయాడు.. ఐపీఎల్‌లో గాయపడటంతో స్టోక్స్‌కు సర్జరీ అనివార్యమైన పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. వీరితో పాటు ఇప్పుడు ఆండ్రూ టై, లివింగ్ స్టోన్ కూడా కరోనా కారణంగా స్వదేశానికి పయనం కావడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది.
నలుగురు విదేశీ ఆటగాళ్లు దూరం కావడంతో ఆ జట్టులో ఇక నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్, డేవిడ్ మిల్లర్‌లు మాత్రమే విదేశీ ఆటగాళ్లు. దీంతో తాము కోల్పోయిన వారి స్థానాల్లో విదేశీ ఆటగాళ్లతో పూడ్చుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. తమకు ఏ ఫ్రాంచైజీ అయినా విదేశీ ఆటగాళ్లను ఇవ్వాలనే కోరుతోంది. ఈ మేరకు రాజస్థాన్ ఫ్రాంచైజీ తమను సంప్రదించినట్లు వేరే ఫ్రాంచైజీ సీఈవోలు కూడా ధృవీకరించారు.‘మా వద్ద ఉన్న విదేశీ ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ ఫ్రాంచైజీ కోరింది. దీనిపై ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. టీమ్ మేనేజ్‌మెంట్‌దే తుది నిర్ణయం’ అని ఓ ఫ్రాంచైజీ సీఈవో తెలిపారు.
అయితే ఐపీఎల్‌లో ఏజట్టులోనైనా 60 శాతం కంటే తక్కువ మంది విదేశీ ఆటగాళ్లు లేకపోతే, లేదా అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకుంటే.. సదరు ఫ్రాంచైజీ లోన్ విండో ఆప్షన్‌ను ఉపయోగించుకునే వీలుంది. అంటే రుణ ప్రాతికదికన వేరే ఫ్రాంచైజీల్లో అధికంగా ఉన్న విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. దీనికి ఆ సదరు ఫ్రాంచైజీలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత సీజన్‌లో రెండు మ్యాచ్‌ల కంటే ఎవరైతే తక్కువగా ఒక ఫ్రాంచైజీ తరఫున ఆడి ఉంటారో వారిని లోన్ విండో రూపంలో తీసుకోవచ్చు. అలా తీసుకున్న ఆటగాడు ఆ సీజన్ అంతా అదే ఫ్రాంచైజీకి ఆడాల్సి ఉంటుంది. అయితే హోమ్ ఫ్రాంచైజీతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు ఆడేందుకు అనర్హుడు.
ఇదిలా ఉంటే ఒకవైపు భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంతో పాటు బయోబబుల్‌లో ఉండడానికి సదరు ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఇప్పటికే చాలామంది తమ దేశాలకు వెళ్లిపోగా, మరికొంతమంది వెళ్లిపోవడానికి సిద్దమైపోయారు. దీంతో ఈ సీజన్లో ఫ్రాంచైజీలకు విదేశీ ఆటగాళ్లు కరువవుతున్నారు. దీంతో ఆర్సీబీ, రాజస్థాన్ వంటి ఫ్రాంచైజీలతో పాటు మరికొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.