దేశంలో కరోనా పరిస్థితులు రాను రాను మరింత దారుణంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా కరోనా బారిన పడిన వారిలో అనేకమంది ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నారు. వారికి సాయం చేసేందుకు అనేకమంది ముందుకొస్తున్నారు. ఐపీఎల్‌లో ఆడుతున్న అనేకమంది క్రికెటర్లు కూడా వీరికి సాయంగా తమవంతు చేయూతనిస్తున్నారు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ శ్రీవత్స్ గోస్వామి కూడా కరోనా పోరాటంలో తనవంతు సాయం అందించాడు. కరోనా కట్టడి నేపథ్యంలో దేశం వ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న బాధితుల కోసం రూ. 90 వేలు విరాళమిచ్చాడు. ఈ విషయాన్ని డొనాటేకర్ట్ అనే చారిటీ ఆర్గనైజేషన్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అత్యవసర సమయంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు శ్రీవాత్సవకు ధన్యవాదాలు తెలిపింది. ఇందుకు స్పందించిన శ్రీవత్స్.. కష్ట సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడాలని, వీలైనంత మేర సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
టీమిండియా 2008 నాటి అండర్-19 వరల్డ్ కప్ భారత జట్టులో శ్రీవత్స్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ విషయానికొస్తే.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన శ్రీవత్స్‌ను గతంలో ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్‌కు శ్రీవత్స్ ప్రాతినిథ్యం వహించాడు. కాగా.. గత సీజన్‌తో పాటు ఈ సీజన్లోనూ అతడిని సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్-2020లో సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరడంతో శ్రీవత్స్ ఇప్పటికీ బెంచ్‌కే పరిమితంగా ఉన్నాడు. ఇక బుధవారం నాటి మ్యాచ్‌లో చెన్నై చేతిలో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఈ సాయంతో సెకండ్‌వేవ్‌తో భారత్ అల్లాడుతున్న వేళ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన తొలి స్వదేశీ క్రికెటర్‌గా శ్రీవత్స్ నిలిచాడు. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘వెల్‌డన్ శ్రీ భాయ్.. మా మనస్సుల్లో నీ స్థానం చెరిగిపోదు. కనీసం నువ్వైనా ముందుకు వచ్చావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో మరికొంతమంది ఆటగాళ్లు కూడా భారత్ సాగిస్తున్న కరోనా పోరులో తమవంతు సాయం అందిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు సైతం తామున్నామంటూ ముందుకొస్తున్నారు. ఇటీవలే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ తన వంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు అందజేసి గొప్ప మనసు చాటుకున్నాడు. అలాగే ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ కూడా 1 బిట్‌కాయిన్(రూ.40 లక్షలకు పైగా) విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు.