ఐపీఎల్ 14వ సీజన్‌ను కరోనా నానా అవస్థలు పెడుతోంది. ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా జట్లకు దూరం అవుతుండడంతో ఆయా ఫ్రాంచైజీలు ఆందోళనలో ఉన్నాయి. దానికి తోడు ఇప్పు ఏకంగా ఐపీఎల్ అంపైర్లు సైతం టోర్నీ నుంచి వైదొలగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్, ఆర్సీబీ నుంచి ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌లు ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో తమ కుటుంబాలను పరిరక్షించుకోవాలని కొందరు తప్పుకుంటే, మరికొందరేమో బయోబబుల్‌లో ఉండలేమంటూ టోర్నీకి వీడ్కోలు చెప్పారు.
తాజాగా ఐపీఎల్ నుంచి ఇద్దరు అంపైర్లు కూడా వైదొలిగారు. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీఫెల్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లో సభ్యులైన వీరిద్దరూ.. ఈ సీజన్ నుంచి తాము వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. నితిన్ మీనన్ తల్లి, భార్య ఇద్దరూ కరోనా బారిన పడడంతో వారికి అండగా ఉండేందుకే తాను టోర్నీ నుంచి వెళ్లిపోతున్నట్లు తెలిపాడు. ఇక రీఫెల్ మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న విమాన రాకపోకల నిషేధం కారణంగా స్వదేశం వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు.
వీరిద్దరూ ఐపీఎల్ నుంచి వెళ్లిపోతున్న విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ‘నితిన్‌కు కొడుకు చాలా చిన్నవాడు. తల్లికి, భార్యకు కరోనా సోకడంతో అతడిని చూసుకోవాల్సిన బాధ్యత అతడిపైనే ఉంది. అందువల్లే అతడు ఐపీఎల్‌ను వీడబోతున్నాడు. ఇక రీఫెల్ భయపడుతున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లడానికి విమాన సౌకర్యం ఉండదనే భయంతో ముందుగా వెళ్లిపోతున్నారు’ అని సదరు అధికారి వెల్లడించారు. అయితే భారత్‌లో చాలామంది స్థానిక అంపైర్లు బ్యాకప్‌గా ఉన్నారని, వారి అంపైరింగ్ సేవల్ని ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు.ః