దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. లక్షల మందిని కబళిస్తూ.. వేల మందిని ప్రాణాలు బలిగొంటూ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులు, సినిమా స్టార్లు, క్రికెట్లు అనే తేడా లేకుండా అందరినీ ఈ మహమ్మారి బాధిస్తోంది. అనేకమంది క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు క్రికెటర్లు కరోనా బారిన పడిన వారికి తమవంతు సాయం అందిస్తున్నారు. స్వదేశీ క్రికెటర్లే కాకుండా, విదేశీ క్రికెటర్లు కూడా భారత్‌లో కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. లక్షల రూపాయలు సాయం అందిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధవన్, రాజస్థాన్ రాయల్స్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ కూడా ఈ జాబితాలో చేరారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అల్లాడుతున్న దేశానికి ఐపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ 90 వేల డాలర్లు, ఆసీస్ మాజీ ప్లేయర్ బ్రెట్‌లీ ఒక బిట్ కాయిన్ తమ వంతుగా సాయం అందించారు. సన్ రైజర్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శ్రీవత్స్ కూడా తనవంతుగా రూ.90వేలు అందించాడు. ఇక ఇప్పుడు శిఖర్ ధవన్ రూ.20లక్షలు, జయదేవ్ ఉనద్కత్ రూ.30 లక్షలు, వీరిద్దరితో పాటు పంజాబ్ కింగ్స్ ఆటగాడు నికోలస్ పూరన్ కూడా కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తానని ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించాడు. ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను కొనుగోలు కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ‘ఆక్సిజన్ ఇండియా’ అనే ఎన్‌జీవో తెలిపింది.
ధవన్ ఇక్కడితో ఆగకుండా.. ఐపీఎల్‌లో తాను గెల్చుకొనే ప్రైజ్‌మనీని కూడా కోవిడ్ సాయంగా అందజేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. రెండు రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే సంస్థకు రూ.కోటి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.