ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన ఎన్నికలు బెంగాల్‌వే. బెంగాల్‌తో అత్యంత బలమైన తృణమూల్ కాంగ్రెస్‌కు పోటీగా బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. దాదాపు 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఏక ఛత్రాధిపత్యంగా దూసుకెళుతున్న టీఎంసీని ఢీకొట్టేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ కీలక నేతలంతా ప్రచారం చేశారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అన్నిరకాలుగా ప్రయత్నించారు. కానీ ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే వారి ప్రయత్నాలు అంతగా ఫలించినట్లు కనపడడం లేదు. దీంతో టీఎంసీ మళ్లీ క్లీన్ విన్ దిశగా దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్‌ను సైతం దాటేస్తూ క్లీన్ విన్ దిశగా మమత దూసుకుపోతోంది.
రాష్ట్రంలోని మొత్తం 292 అసెంబ్లీ స్థానాల్లో మధ్యాహ్నం 2 గంటల సమయానికి 205 స్థానాల్లో టీఎంసీ దూసుకుపోతోంది. దీంతో రాష్ట్రంలో మూడోసారి కూడా మమతదే అధికారంగా కనిపిస్తోంది. బీజేపీ 84 స్థానాల్లో ముందుకు వెళుతోంది. ఇక లెఫ్ట్ ఒక్క స్థానంలో ఉండగా, మిగతా వారు 2 స్థానాలకు పరిమితమైపోయారు.
అయితే మమత పార్టీ సంపూర్ణ విజయం వైపు దూసుకువెళుతున్నా.. బీజేపీ చేసిన పోరాటం కూడా వృథా కాలేదు. గత ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 85 స్థానాల వరకు విజయం సాధించే దిశగా ముందంజలో ఉంది. దీంతో బెంగాల్లో బీజేపీకి ఇది ఓ స్థాయిలో విజయంలాంటిదేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు 3 స్థానాల్లో అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో మమతకు చెమటలు పట్టించిన బీజేపీ.. ఈ సారి మరింత బలంగా టీఎంసీని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయనే అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో మమత గెలుపు దిశగా దూసుకెళ్లడానికి ఆమె ప్రచారంలో పాటించిన విధానాలే కారణంగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అద్భుతంగా ఫలించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీకి కౌంటర్‌గా తాను పక్కా హిందువునని మమత చెప్పడం, ప్రతి ఎన్నికల ప్రచారంలో చండీ మంత్రంతో మొదలు పెట్టడం వంటి విధానాలు ఆమెకు ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న మమత తొలి 10 రౌండ్ల వరకు వెనుకబడి ఉన్నారు. అయితే 11వ రౌండ్లో మాత్రం మమత 3వేల ఓట్ల మెజార్టీ సాధించారు. టీఎంసీ నుంచి ఇటీవలే బయటకు వెళ్లిన సుబేందు ఆమెపై పోటీ చేస్తున్నారు.
ఇక బీజేపీ వెనుకబడానికి ప్రధాన కారణంగా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా సరైన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం, స్థానిక నాయకుల బలం తక్కువగా ఉండడం, ముస్లింల వ్యతిరేకత వంటి అంశాలే బీజేపీ ఓటమివైపు వెళ్లడానికి కారణంగా కనిపిస్తోంది.