ఇంగ్లండ్ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఆదివారం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 64 బంతుల్లోనే 11 ఫోర్లు.. 8 సిక్సర్లు 124 పరుగులు చేసి పరుగుల సునామీ సృష్టించాడు. దీంతో ఐపీఎల్‌లో తొలిసారిగా బట్లర్ శతకం సాధించాడు. మరో విచిత్రం ఏంటంటే బట్లర్‌కు ఇది తొలి టీ20 శతకం కూడా. ఇంగ్లండ్ తరపున బట్లర్ ప్రారంభం నుంచి ఎక్కువగా మిడిల్ ఆర్డర్‌లో ఆడుతూ ఉండేవాడు. దీంతో అతనికి ఎప్పుడూ టీ20ల్లో సెంచరీలు చేసే అవకాశమే రాలేదు. అయితే ఈ రోజు మాత్రం అతడు కెరీర్లో తొలి సెంచరీతో అదరగొట్టాడు. అంతేకాదు ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు.
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన బట్లర్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఇక తనను సెంచరీ చేయని టీ20 బ్యాట్స్‌మన్ అంటూ కుక్ అనడని భావిస్తున్నానని అన్నాడు. ‘నా కెరీర్ ఆరంభంలో ఇంగ్లండ్ తరపున ఎక్కువగా మిడిల్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేసేవాడిని. ఆ స్థానంలో వస్తే సెంచరీలు చేసే అవకాశం ఏ ఆటగాడికీ ఉండదు. ఇక టీ20ల్లో అసలు ఆ ఆలోచన కూడా చేయలేం. అయితే 2017-18 నుంచి ఇంగ్లండ్ తరపున టీ20ల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా వస్తున్నా. కానీ ఇప్పటికీ సెంచరీ సాధించలేకపోయాను. ఈ క్రమంలోనే అలిస్టర్ కుక్ నన్ను సెంచరీ సాధించని బ్యాట్స్‌మన్ అని అంటుండేవాడు. అయితే ఐపీఎల్‌లో ఈ రోజు ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో నా కోరిక నెరవేరింది.
అంతేగాక ఈ సందర్భంగా నా మిత్రుడు.. సీనియర్ క్రికెటర్ అలిస్టర్ కుక్ నన్ను ఎప్పుడూ టీ20ల్లో సెంచరీ సాధించలేకపోయానని అనేవాడు. ఇక నుంచి ఆ మాట అనడని భావిస్తున్నా’ అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఇంగ్లండ్ తరపున అన్న ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా కుక్ పేరు పొందాడు. తన కెరీర్‌లో ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన కుక్ 32 టీ20లు మాత్రమే ఆడాడు. అయితే 2009 టీ20 ప్రపంచకప్‌లో కుక్ 57 బంతుల్లోనే శతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఇక బట్లర్ ఇప్పటివరకు ఇంగ్లండ్ సహా అన్ని లీగ్‌లు కలిపి 282 టీ20 మ్యాచ్‌లాడి 47 హాప్ సెంచరీలు చేశాడు తప్ప ఇంతవరకు ఒక్క సెంచరీ సాధించలేదు. అయితే ఈ రోజు మ్యాచ్‌లో ఆ ఆశ తీర్చుకున్నాడు.