కొండను తవ్వి ఎలుకను పట్టాడట వెనకటికి ఒకడు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలానే ఉంది. తిరుపతి బై ఎలక్షన్స్‌లో విజయం సాధించినా, వచ్చిన మెజారిటీని చూసుకుని ఆ పార్టీ తలెత్తుకోలేకపోతోంది. కారణం వారి ఓవర్ యాక్షన్. ఒకరు 3 లక్షల మెజారిటీ అని చెప్పారు. మరొకరు ‘నాలుగు లక్షలకు పైనే చూసుకోండి’ అంటూ ఊదరగొట్టారు ఇంకొంకరు ‘ఏకంగా 5 లక్షల మెజారీటీకి తగ్గదు.. చూస్తారా..?’ అంటూ సవాళ్లు సైతం విసిరారు. ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ జరిగింది. ఫలితంతో వైసీపీకి కళ్లు బైర్లుగమ్మాయి. గెలిచినందుకు ఆనందపడాలా..? మెజారిటీ చూసుకుని బాధపడాలా..? అనేది అర్థం కాక పరాభవంతో సైలెంట్ అయిపోయారు ఆ పార్టీ నేతలంతా. అయితే ప్రత్యర్థి పార్టీలు మాత్రం గెలుపు సాధించలేకపోయినా.. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత మాత్రం పెరుగుతోందని, ఈ ఎన్నికలే దానికి నిదర్శనమని గొంతెత్తి చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున బల్లి దుర్గాప్రసాద్ ఇక్కడి నుంచి గెలిచారు. సమీప ప్రత్యర్థి, టీడీపీ ప్రత్యర్థి పనబాక లక్ష్మిపై 2,28,376 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా పనబాక లక్ష్మిపై వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. అది కూడా 2.71572 ఓల్మ మెజారిటీతో గెలిచారు. కానీ ఈ విజయం వైసీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ప్రధానంగా జిల్లా కేంద్రంలో అనేక ప్రాంతాల్లో వైసీపీ ప్రాభవం పడిపోవడం వారికి ఆందోళన కలిగిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాల్లో 2,88,012 ఓట్లు ఆ పార్టీ సాధించింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 2,60,891. అంటే మునుపటి కంటే 27,121 ఓట్లు ఆ పార్టీకి తగ్గిపోయాయి. పోలింగ్ శాతం ఆధారంగా చూస్తే 2019 ఎన్నికల కంటే ఎక్కువగానే ఉన్నా.. ఓట్ల సంఖ్య పరంగా చూస్తే ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా శ్రీకాళహస్తి, సత్యవేడుల్లో గతానికంటే వైసీపీకి ఆధిక్యత తగ్గింది. శ్రీకాళహస్తిలో గత ఎన్నికల్లో వైసీపీకి 32,919 ఓట్లు మెజారిటీ రాగా తాజా ఓట్ల లెక్కింపులో 31,469 మెజారిటీ వచ్చింది. సత్యవేడు సెగ్మెంట్‌లో కిందటి ఎన్నికల్లో వైసీపీకి 42,196 ఓట్ల మెజారిటీ వస్తే ఇపుడు ఆధిక్యత 38,144కు పడిపోయింది. దీనిని బట్టి వైసీపీపై ప్రజల్లో వైసీపీపై అసంతృప్టి పెరుగుతోందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ప్రత్యర్థి పార్టీల మాట. ఏది ఏమైనా ఎన్నికల పరంగా వైసీపీ గెలిచి ఉండొచ్చు కానీ, నైతికంగా ఓడిపోయిందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా వైసీపీ ఆత్మశోధన చేసుకుంటుందేమో చూడాలి