దేశంలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు. ఇది ప్రస్తుతం దేశంలో దుస్థితి. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యాక్సిన్లు కూడా మన దేశంలో లేకపోవడం శోచనీయం. ఇక వీటికి తోడు ప్రస్తుతం కరోనా నిర్ధారణ కోసం అనుసరిస్తున్న విధానాలు కూడా అంతటి ఫలితాలను చూపించడం లేదు. అంతేకాకుండా ఫలితం కోసం దాదాపు 2 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా కరోనా నిర్ధారణకు ఓ కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని ద్వారా కేవలం 3 గంటల్లోనే కరోనా నిర్ధారణ చేయవచ్చని వారు చెబుతున్నారు.
నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కొత్త కరోనా నిర్ధారణ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిని ‘డ్రై స్వాబ్ టెస్ట్’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానం తమవద్దే ఉందని, త్వరలోనే ఈ విధానాన్ని మరిన్ని ప్రయోగశాలలకు విస్తరిస్తామని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల కరోనా బాధితులను గంటల వ్యవధిలో గుర్తించవచ్చని, తద్వారా వాని నుంచి ఇతరులకు సోకకుండా నియంత్రించవచ్చని వారంటున్నారు. అంతేకాకుండా కరోనా వ్యాప్తిని కూడా చాలా వరకు అరికట్టవచ్చని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా నిర్ధారణ కోసం ఎక్కువగా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌పైనే ఆధారపడుతున్నారు. స్పష్టమైన ఫలితం ఈ టెస్ట్ ద్వరానే వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ టెస్టు రిజల్ట్స్ రావాలంటే దాదాపు 48 గంటలు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని అధిగమించేందుకు ఆర్టీపీసీఆర్ కంటే వేగంగా కచ్చితమైన ఫలితాలనిచ్చే విధానంపై చాలా రోజులుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర వైద్య శాస్త్రవేత్తలు డ్రై స్వాబ్ టెస్టును పరిశీలించి అందుబాటులోకి తీసుకొచ్చారు.