టీమిండియా క్రికెట్ అభిమానుల్లో ప్రస్తుతం అందరి దృష్టి యువ ఆటగాళ్లపైనే ఉంది. అందులోనూ ఆసీస్‌తో టెస్టుల్లో అదరగొట్టి, ఐపీఎల్‌లోనూ బాగానే రాణిస్తున్న శుభ్‌మన్ గిల్ విషయంలో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆసీస్ సిరీస్‌కు, ఐపీఎల్‌కు మధ్యలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్ అంత గొప్ప ప్రదర్శన చేయలేదు. దీంతో ఆటలో అతడు పూర్తి స్థాయిలో పరిణితి సాధించలేదని, ఇంకా చాలా నేర్చుకోవాలని, ఇలా ఆడితే టీమిండియాలో రిషబ్ పంత్ ఒకప్పుడు ఎదుర్కొన్న సమస్యనే గిల్ కూడా ఎదుర్కొంటాడని అంతా అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ దీనిపై స్పందించాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గావస్కర్.. గిల్‌కు మద్దతుగా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ ఇంకా 21 ఏళ్ల కుర్రాడని, ప్రశాంతంగా ఉంటూనే వైఫల్యాల నుంచి నేర్చుకోవాలని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసిన గిల్.. ఈ సారి టోర్నీ వాయిదా పడకముందు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 132 పరుగులు చేశాడు. దాంతో అతడిపై ఒత్తిడి పెరిగిందని గావస్కర్ అన్నాడు.
‘గిల్ వైఫల్యాలకు కారణం అతడిపై ఉన్న అంచనాలేనని నా అభిప్రాయం. అవే అతడిపై ఒత్తిడి పెంచి ఉంటాయి. ఐపీఎల్ కన్నా ముందు పరిస్థితులు వేరు. అతడో నమ్మకమైన యువ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో అతడి ఆట చూశాక బాగా ఆడతాడనే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలే అతడిని ఒత్తిడిలోకి నెడుతున్నాయని అనుకుంటున్నాను. దీని నుంచి అతడు బయటపడాలంటే ప్రశాంతంగా ఉండడమే గిల్ ముందున్న మార్గం. అతడు ఇంకా 21 ఏళ్ల కుర్రాడే. ఎవరికైనా వైఫల్యాలు ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవాల’ని గావస్కర్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఓపెనర్‌గా అతడికి మంచి భవిష్యత్తుందని, ఓపెనింగ్ చేస్తూ దేని గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా, సహజసిద్ధమైన ఆట ఆడగలిగితే గిల్ మళ్లీ ఫాం అందుకోగలడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.