సెల్ఫీలు, వ్లాగ్‌లు వచ్చిన తరువాత అనేకమంది వెర్రి చేష్టలతో తెగ వైరల్ అవుతున్నారు. ఇంకొంతమంది విచిత్ర చేష్టలు చేయబోయి ప్రాణాలే కోల్పోయే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సమద్రం ఒడ్డున తిరుగుతున్నాడు. అంతలో అతడికి ఒడ్డున ఓ జెల్లీ ఫిష్ లాంటి జీవి కనిపించింది. వెంటనే దానిని చేతుల్లోకి తీసుకుని కెమెరాలకు పోజులివ్వడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో లైవ్ వీడియో చేస్తూ.. అదో జెల్లీ ఫిష్ అని, తాను దానిని నాలుకతో నాకబోతున్నానని చెప్పుకొచ్చాడు.
‘‘చూడండి గైస్ జెల్లీ ఫిష్ ఇక్కడుంది. దీనిని నేను ఇప్పుడు నాకబోతున్నా’’ అని చెప్పాడు. ‘‘ఇది ఎలా కనిపిస్తోంది. అవును, ఇదో జెల్లీ ఫిష్. ఎంత పెద్దగా ఉందో కదా. ఇంకా కదులుతోంది. ఓ మై గాడ్.. దీనిని ఇప్పుడు నాకబోతున్నా’’ అని వీడియోలో అతడు చెప్పడం గమనించవచ్చు. అయితే ఇంతలో అతడికి ఆ వీడియో చూస్తున్న వారి నుంచి వరుసగా మెసేజ్‌లు రావడం మొదలు పెట్టాయి.
అనేకమంది యూజర్లు అతడిని హెచ్చరించారు. అది జెల్లీ ఫిష్ కాదని, అత్యంత విషపూరితమైన ఫ్లోటింగ్ టెర్రర్ ఫిష్ అని హెచ్చరించారు. దీంతో అతడు దానిని నాకే పనిని పక్కన పెట్టేశాడు. ఓ యూజర్ ‘‘అది జెల్లీఫిష్ కాదు. పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ టెర్రర్’. ‘బ్లూ బాటిల్ ఫిష్’. దీనినే ‘ఫ్లోటింగ్ టెర్రర్’ అని కూడా దీనిని పిలుస్తారు. ఒక్క ఆస్ట్రేలియాలోనే దీని బారిన ఏడాదికి 10 వేల మంది పడుతున్నారు. దాని విషం చాలా ప్రమాదకరమైనది. అది కుడితే కనుక ఆ తీవ్రమైన బాధ మూడు రోజులుంటుంది. స్పృహ కోల్పోతారు. సకాలంలో వైద్యం అందకుంటే ప్రాణాలే పోతాయి. అయినప్పటికీ వెన్నుపూస అదిరిపోయేంత బాధను భరించాల్సి ఉంటుంది’’ అని కామెంట్ చేశాడు.
మరో యూజర్ ఇది సిఫోనోఫోర్ జాతికి చెందినదని, ఇది కుడితే కనుక ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయమని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ‘‘నిజం చెప్పాలంటే నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. దాని విషం చాలా ప్రమాదకరం. గొంతువాపు, హృద్రోగ సమస్యలు, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. ఇంకా చెప్పాలంటే చనిపోవడం ఖాయం’’ అని ఆ ప్రమాదకర జీవి గురించి వివరించాడు. దాని టెంటకిల్స్ శరీరానికి తాకినా ప్రమాదమేనని చెప్పుకొచ్చాడు.
నెటిజన్ల హెచ్చరికలతో అతడు ఆ చేపను నాకే పనిని విరమించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అందుకే మనకు తెలియని వాటిలో అంతగా వేళ్లు పెట్టకూడదని. పెడితే అనేకసార్లు భారీ చెల్లించుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త సుమీ.