అత్యంత కట్టుదిట్టమైన నిబంధనల మధ్య నిర్వహించినప్పటికీ ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో సీజన్ మొత్తం అర్థాంతరంగా రద్దయిపోయింది. దీంతో విదేశీ ఆటగాళ్లంతా వారి వారి దేశాలకు ప్రైవేట్ విమానాల్లో వెళ్లిపోయారు. ఇక స్వదేశీ ఆటగాళ్లు కూడా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే వాళ్లంతా బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ రాబోయే టూర్ల కోసం వారంతా ఇంగ్లండ్, శ్రీలంకలకు వెళ్లబోతున్నారు.మరి కొన్ని వారాల్లో టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లనున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఇంటిపట్టునే ఉంటూ ప్రాక్టీస్.. ఫిట్‌నెస్ అంశాలపై దృష్టి పెట్టారు. జూన్ నెలలో న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడబోతోంది. దీంతో పాటు ఆగస్టులో ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. టీమిండియా వికెట్ కీపన్ రిషబ్ పంత్ కూడా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు.
దేశమంతా లాక్‌డౌన్ ఉండడంతో ఎక్కడికి వెళ్లలేక ఇంట్లోనే ఉంటూ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సందర్భంగా పంత్ తన ఇంట్లోని గార్డెనింగ్ ఏరియాలో మోవర్ యంత్రంతో అటు ఇటు తిరుగుతూ గడ్డిని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేశాడు.‘‘యే దిల్ మాంగే ‘మోవర్’’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. అనుకోకుండా వచ్చిన క్వారంటైన్ బ్రేక్‌తో ఏం చేయలో అర్థం కాలేదు. కానీ మా ఇంటి ఆవరణలో గార్డెనింగ్ చేయడం కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇది నాకు మంచి వ్యాయామమే గాక ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతోంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. పంత్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Ye Dil Mange “Mower”!
Forced quarantine break but happy to be able to stay active while indoors. Please stay safe everyone.#RP17 pic.twitter.com/6DXmI2N1GY— Rishabh Pant (@RishabhPant17) May 11, 2021
కాగా.. రిషబ్ పంత్ ఆసీస్‌తో టెస్టు సిరీస్ నుంచి పంత్ సూపర్ ఫాంలో ఉన్నాడు. దాంతోపాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగిన సిరీస్‌లోనూ అదరగొట్టాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు నిర్వహించారు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపే ప్రదర్శన చేసింది. మొత్తం టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు గెలిచి 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఇక పంత్ 8 మ్యాచ్‌ల్లో రెండు అర్థ సెంచరీలతో 213 పరుగులు సాధించాడు.