టీమిండియా గత నాలుగైదేళ్లుగా టెస్టు క్రికెట్‌లో మంచి ఆటతీరును కనబరుస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లోనూ అతిథ్య జట్లపై అధిపత్యం చెలాయించి సిరీస్‌లను చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే టెస్టుల్లో పూర్వవైభవాన్ని పొంది ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. అలాగే మరికొద్ది రోజుల్లో ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఆడబోతోంది. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఢీ కొట్టనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ అందుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది.
ఈ సందర్భంలోనే టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం టీమిండియాకు ఆడేందుకు కనీసం 50 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, భారత్ జట్టు రిజర్వ్ బెంచ్ బలం బాగుందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు. ఇలాంటి రిజర్వ్ బెంచ్ 1990, 2000 దశకాల్లోని ఆస్ట్రేలియా జట్టుకు కూడా లేదని పేర్కొన్నాడు. అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లు, ప్రతిభగల యువ ఆటగాళ్లతో భారత్ క్రికెట్ పటిష్టంగా ఉందని అన్నాడు.
`కోహ్లీ సారథ్యంలో 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంటే.. అంతే బలమైన మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. దీనిని బట్టి చూస్తే భారత్ క్రికెట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఓ దేశం తరఫున 2 జాతీయ జట్లు వివిధ దేశాలతో ఒకేసారి తలపడటం క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌కు మాత్రమే ఆ సత్తా ఉంద’ని ఇంజమామ్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే భారత్ క్రికెట్ చరిత్రలో టీమిండియా తొలిసారి రెండు జాతీయ జట్లతో బరిలోకి దిగనుంది. వచ్చే నెల నుంచి తొలి జట్టు ఇంగ్లండ్‌లో వరుస టెస్ట్ సిరీస్‌లు ఆడనుండగా.. అదే సమయంలో ఇండియా-2 జట్టు శ్రీలంకతో వన్డేలు, టీ20 సిరీస్‌లు ఆడనుంది.