చైనాలో మహా అయితే అక్కడి అధ్యక్షుడు జిన్ పింగ్ విగ్రహాలు అమ్ముడు కావాలి కానీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు, అది కూడా చైనా పేరు చెబితేనే నిప్పులు తొక్కినట్లు అంతెత్తు ఎగిరే ట్రంప్ విగ్రహాలకు అక్కడ డిమాండ్ పెరగడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును ఇది కొంత ఆశ్చర్యం కలిగించినా నిజం. చైనాలో ఇప్పుడు ట్రంప్ విగ్రహాలకు భారీ డిమాండ్ ఉంది. బుద్ధుడిలా రెండు చేతులను ఒళ్లో పెట్టుకుని, కళ్లు మూసికుని ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్న ట్రంప్ విగ్రహాలకు చైనా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఇప్పుడు భలే డిమాండ్ ఉంది. చైనా ప్రజలు కూడా వాటిని కొనేందుకు తెగ ఇష్టపడుతున్నారు. అది కూడా ఏదో వంద, రెండొందలు కాదు.. ఏకంగా వేలకు వేలు పోసి ఒక్కో విగ్రహాన్ని కొనుగోలు చేస్తున్నారు. 1.6 మీటర్ల ఎత్తైన విగ్రహం రూ.11వేలు, 4.6 మీటర్ల ఎత్తైన విగ్రహం రూ.45వేలుగా ధర పలుకుతోంది. అంత ధర ఉన్నా అక్కడి ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు వెనుకాడడం లేదు.
ట్రంప్ విగ్రహాలను ఆన్‌లైన్ అమ్మకానికి ఉంచిన వ్యాపారి కూడా తన ఐడియపై స్పందించాడు. ‘‘తొలుత 100 విగ్రహాలను తయారు చేయించి.. ‘మీ కంపెనీ మళ్లీ గొప్పగా మార్చుకోండి’ అనే నినాదంతో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాను. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే చాలా విగ్రహాలు అమ్ముడుపోయాయ’ని ఆయన చెబుతున్నాడు. ట్రంప్ విగ్రహాల కొనుగోలుపై కస్టమర్లు మాట్లాడుతూ.. ఏదో సరదాగానే ట్రంప్ విగ్రహాలను కొంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఎంత సరదా అయితే మాత్రం వేలకు వేలు పోయి కొనడం అంటే మామూలు విషయం కాదు మరి.
ఇదిలా ఉంటే ట్రంప్ అధికారంలో ఉండగా.. కరోనా విషయంలో చైనాను అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను చైనా వైరస్ అంటూ అనేకసార్లు సంబోధించారు. దీనిపై చైనా కూడా అదే స్థాయిలో మండిపడింది. ఇక ఈ రెండు దేశాల మధ్య సాగిన ట్రేడ్ వార్ అంతా ఇంతా కాదు.