ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ ప్రేమికులు ఎంత ఆసక్తిగా ఉన్నారో వేరే చెప్పక్కర్లేదు. అందుకు మ్యాచ్‌కు ముందే సౌతాంప్టన్ స్టేడియంలోని టికెట్‌లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మ్యాచ్‌ను ఎలాగైనా లైవ్‌లో చూడాలని స్టేడియానికి వచ్చేందుకు అభిమానులు ఎగబడుతుండడం టికెట్ ధర ఆకాశానికి చేరుతోంది. ప్రస్తుతం లెక్కల ప్రకారం.. టికెట్ భారత్ కరెన్సీలో రెండు లక్షల రూపాయల వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. అయితే అఫీషియల్‌గా కాదులెండి బ్లాక్ మార్కెట్లో.
జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ పోటీ పడనున్న విషం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) ఇదివరకే ప్రకటించింది. దీనికి సంబంధించి ఈసీబీ తాజాగా మరో ప్రకటన చేసింది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేవలం 4 వేల మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని ఆతిధ్య హాంప్‌షైర్ కౌంటీ క్లబ్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం టికెట్లు ఇస్తామని.. మిగిలిన 2000 టికెట్లను మాత్రమే అమ్మకానికి ఉంచుతామని హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలియజేశారు.
కాగా, ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌లో క్రికెట్ అభిమానులకు గొప్ప అవకాశమనే చెప్పాలి. కరోనా కారణంగా 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఇంగ్లండ్ బోర్డు మైదానాల్లోకి ఫ్యాన్స్‌ను అనుమతించలేదు. సెప్టెంబరు నుంచి, జనవరి వరకు మ్యాచ్‌లు లేకపోవడం, ఆ తర్వాత కరోనా రావడంతో ఫ్యాన్స్ రెండేళ్లుగా మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో రెండేళ్ల తరువాత తొలిసారి ప్రేక్షకులను అనుమతించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు డిమాండ్ పెరిగింది.