ఐపీఎల్ కోసం తమ జాతీయ జట్టు షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేమని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ యాష్లే గైల్స్ తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 18నుంచి ఐపీఎల్ మళ్లీ జరిగే అవకాశం ఉండగా, అదే సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఇంగ్లండ్ తలపడనుడడం వల్ల ఈసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఐపీఎల్ కోసం టెస్టు సిరీస్ తేదీల్లో మార్పులు చేయమని మాకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తులూ రాలేదు. భారత్‌తో చివరి టెస్టు ఆడగానే ఆటగాళ్లు బంగ్లాదేశ్ బయల్దేరతారు. అనంతరం పాకిస్తాన్‌తో సిరీస్, ఆపై టీ20 ప్రపంచ కప్ ఆడతారు. మున్ముందు యాషెస్ సిరీస్ కూడా ఉంది కాబట్టి కొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మేం విశ్రాంతినివ్వాలని భావిస్తున్నాం. వారికి విరామం ఇచ్చినప్పటికీ వేరే చోట క్రికెట్ ఆడేందుకు అనుమతులు ఇచ్చే అవకాశం లేద’ని గైల్స్ పేర్కొన్నాడు. అంటే ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లను అనుమతించబోమని చెప్పకనే చెప్పాడన్నమాట.
కాగా.. అత్యంత పటిష్ఠ బయోబబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహించినప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ అర్థాంతరంగా నిలిపివేసింది. ఆటగాళ్లను వారి వారి దేశాలకు పంపేసింది. దీంతో బీసీసీఐకి వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఎలాగైనా మిగతా టోర్నీని నిర్వహించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరులో టోర్నీని పూర్తి చేయాలని భావిస్తోంది. దానికోసం ఏర్పాట్లు కూడా చేస్తోంది.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మిగిలిన 31 మ్యాచ్‌లనూ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుండగా.. తమ ఆటగాళ్లను మాత్రం రెండో దశ పోటీలకు అనుమతించేది లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) స్పష్టం చేసింది. ఇరు బోర్డుల మధ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నా.. లీగ్ విషయంలో మాత్రం ఈసీబీ ఒప్పుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఐపీఎల్14వ సీజన్ సెకండ్ షెడ్యూల్‌కు ఆసీస్ ఆటగాళ్లు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లీగ్‌లో ఆ దేశ ఆటగాళ్లు పాల్గొనడం అనుమానంగా మారింది. ఈ పర్యటనలో ఆసీస్ ఐదు టీ20లు ఆడనుండగా, సిరీస్ పూర్తయ్యే సరికి ఐపీఎల్ సెకండాఫ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తవుతాయి.