కరోనా వైరస్ గబ్బిలం నుంచి వచ్చిందని ప్రపంచం మొత్తం భావిస్తోంది. దీంతో గబ్బిలాలను ఎక్కడ చూసినా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక అవి అనుకోకుండా కంటబడితే పరుగందుకుంటున్నారు. కాగా.. తాజాగా ఓ విమానంలో గబ్బిలం కనిపించింది. దీంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన భారత రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్‌కు బయలుదేరిన విమానంలో జరిగింది.
ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 2.20 గంటలకు నెవార్క్ బయలుదేరింది. అరగంట ప్రయాణం తర్వాత విమానంలో గబ్బిలం ఉన్న విషయాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించాడు. సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కి చేరవేశాడు. గబ్బిలాన్నికేబిన్ లోపల సిబ్బంది గుర్తించడంతో అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానం 3.55 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయినట్టు వివరించారు. బిజినెస్ క్లాస్ క్యాబిన్‌లో గబ్బిలం చనిపోయిందని, దాని కళేబరాన్ని పూర్తిగా తొలగించిన అనంతరం డిస్‌ఇన్ఫెక్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
కాగా.. విమానంలోకి గబ్బిలం ఎలా వచ్చిందనే విషయంపై ఫ్లైట్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేటరింగ్ వాహనాల ద్వారా విమానంలోకి గబ్బిలం చొరబడి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత విమానంలోని ప్రయాణికులను మరో విమానంలోకి తరలించారు. ఆ విమానం ఉదయం 11.35 గంటలకు నెవార్క్‌లో క్షేమంగా ల్యాండ్ అయినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.