వ్యాక్సినేషన్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చేస్తామని జవదేకర్ ప్రకటించారు. డిసెంబర్ నాటికి 108 కోట్ల భారతీయులకు వ్యాక్సిన్ ఇచ్చేస్తామని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ అవుతున్న దేశం భారత్ అన్న విషయాన్ని రాహుల్ గుర్తిస్తే బాగుంటుందని జవదేకర్ పేర్కొన్నారు. ‘‘డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేస్తాం. ఎలా అన్నది కేంద్ర ఆరోగ్య శాఖ ఓ బ్లూ ప్రింట్‌ను కూడా సిద్ధం చేసింది. వ్యాక్సినేషన్ పై అంత శ్రద్ధ ఉంటే మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై దృష్టి నిలపండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ విషయంలో గజిబిజే’’ అని జవదేకర్ మండిపడ్డారు.
కాగా. అంతకుముందు ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. వర్చువల్ విధానం ద్వారా ఆయన మీడియాతో మాట్లాడిన రాహుల్.. దేశంలో రెండో వేవ్ విరుచుకుపడడానికి ప్రధాని చర్యలే కారణమని ఆరోపించారు. మోదీకి అసలు కొవిడ్ అంటేనే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రధానిని ఒక ఈవెంట్ మేనేజర్‌గా అభివర్ణించిన రాహుల్ భారత్‌లో జరిగే ప్రతి అంశాన్ని ఆయన ఓ ఈవెంట్‌లాగే పరిగణిస్తారని మండిపడ్డారు. భారత్‌లో మరణాల రేటు తప్పుల తడకగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా టీకా అందించేందుకు సరైన వ్యాక్సినేషన్ ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఒకవేళ ఈ విషయంలో విఫలమైతే భారత్‌పై మరిన్ని కరోనా వేవ్‌లు విరుచుకుపడతాయని హెచ్చరించారు. లాక్‌డౌన్, భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నియమాలు వైరస్‌ను కట్టడి చేసేందుకు తాత్కాలిక చర్యలు మాత్రమేనన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడం ఒక్కటే మహమ్మారిని పారదోలేందుకు మార్గమని హితవు పలికారు.