దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 18 ఏళ్ళు నిండిన వారందరికీ ఉచిత టీకా అందించేలా కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ వాక్సినేషన్ ఫ్రీగా ప్రజలకు అందిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్కడ చూసినా హోర్డింగులు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ‘థాంక్ యు మోడీ’ అంటూ పోస్టులు దర్శనమిస్తున్నాయి.
ఇంకా విచిత్రం ఏంటంటే ఈ పోస్టర్లు, బ్యానర్లను వినియోగించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కార్యదర్శి రజనీష్ జైన్ స్వయంగా చెప్పారు. దేశంలోని అన్ని వర్సిటీలు, కాలేజీలు, సాంకేతిక విద్యాసంస్థలకు వాట్సాప్ సందేశం ద్వారా ఈ విఆహాయాన్ని తెలియజేశారు. సంస్థ సోషల్ మీడియా పేజీల్లో సైతం మోదీకి కృతజ్ఞతలు తెలిపే బ్యానర్లను షేర్ చేయాలని ఆయన సూచించారు.
అంతేకాదు ఆయా బ్యానర్లు రూపొందించాల్సిన శ్రమ కూడా విద్యాసంస్థలకు లేకుండా.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ స్వయంగా.. ‘థాంక్యూ పీఎం మోదీ’, ‘వ్యాక్సిన్ ఫర్ ఆల్(అందరికీ వ్యాక్సిన్)’, ‘ఫ్రీ ఫర్ ఆల్ (అందరికీ ఉచితం)’ అనే నినాదాలతో హిందీ,ఇంగ్లీష్ భాషల్లో ఈ డిజైన్లను రూపొందించి, అందరికీ అందజేశారు.