హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ ప్రయాణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచనలనంగా మారింది. బీజేపీలో చేరేందుకే ఆయన ఢిల్లీ పయనం అయ్యారనేది కొందరు విశ్లేషకుల మాట. అయితే ఈటల బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా బాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆయన ఒక్కసారి కూడా తనంతతానుగా ఎప్పుడూ బయటపడలేదు. కానీ భూ కబ్జా ఆరోపణల కారణంగా ఈటలను సీఎం కేసీఆర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తరువాత ఈటలకు పార్టీకి మధ్య పెద్ద అగాధం ఏర్పడినట్లైంది. అప్పటినుంచి ఈటల చుట్టూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెగ తిరుగుతున్నారు. ఆయనను తమ పార్టీలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు కొందరు ఈటలతో మంతనాలు కూడా జరిపారు. ఈ విషయాన్ని ఈటల రాజేందర్ స్వయంగా అంగీకరించారు.
అంతేకాదు.. తానే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసినట్లు కూడా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి బయలుదేరడంతో బీజేపీలో చేరతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈటలను బీజేపీలో చేర్చుకోవడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరో ఇద్దరు అగ్రనేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే చర్చలు కూడా జరిపారట. బండి సంజయ్ చెప్పిన విషయాలతో దీనికి జాతీయ నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 11 గంటలకు బీజేపీ నేత జేపీ నడ్డాతో మాజీమంత్రి ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. రేపు ఉదయం ఢిల్లీకి బీజేపీ నేత బండి సంజయ్ వెళ్లనున్నారు. ఈటలను నడ్డా దగ్గరకు బండి సంజయ్ స్వయంగా తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కూడా ఈటల కలిసే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు.